'గని' కోసం గాయాలైనా లెక్కచేయని మెగా ప్రిన్స్!

Sat Apr 02 2022 21:06:43 GMT+0530 (India Standard Time)

Naresh About Ghani Movie

వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో 'గని' సినిమా రూపొందింది. అల్లు బాబీ -  సిద్ధు ముద్ద నిర్మించిన ఈ సినిమాతో కథానాయికగా సైయీ మంజ్రేకర్ పరిచయమవుతోంది. బాక్సర్ గా వరుణ్ తేజ్ కనిపించనున్న ఈ సినిమాలో జగపతిబాబు .. సునీల్ శెట్టి .. ఉపేంద్ర .. నరేశ్ .. నదియా ముఖ్యమైన పాత్రలను పోషించారు. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను ఈ నెల 8వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో వైజాగ్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. అల్లు అర్జున్ చీఫ్ గెస్టుగా జరిగిన ఈవెంట్ కి వేల సంఖ్యలో అభిమానూలు తరలి వచ్చారు.ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రను పోషించిన నరేశ్ ఈ వేదికపై మాట్లాడుతూ .. " శుభకృత్ నామ సంవత్సరం ' గని'  సినిమాతో ప్రారంభం కావడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ సినిమా కరోనాను దాటుకుని గ్రాండ్ రిలీజ్ వైపు వస్తోంది. ఇలాంటి ఒక సినిమాలో నేను భాగమైనందుకు నాకు చాలా గర్వంగా ఉంది. వరుణ్ తేజ్ .. చరణ్ .. సాయిధరమ్ తేజ్  .. బన్నీ .. వీళ్లందరూ చిన్నపిల్లల్లా ఉన్నప్పటి నుంచి చూశాను. ఈ రోజున ఇండియా గర్వించదగిన స్టార్స్ అయ్యారు. నేను 'రాకీ' సినిమా చూసినప్పుడు ఇలాంటి ఒక సినిమా ఇండియాలో వస్తుందా అని అనుకున్నాను.

అలాంటి సినిమాగా ఈ నెల 8వ తేదీన 'గని' వస్తోంది. వరుణ్ తేజ్ ఒక దీక్షతో ఈ సినిమా చేశాడు. ఎన్నిసార్లు గాయాలైనప్పటికీ లెక్క చేయలేదు. ఎంతో అంకితభావంతో ఆయన ఈ సినిమాను మీకు అందించబోతున్నాడు.
ఈ సినిమాను అనుకున్న అవుట్ పుట్ తో బయటికి తీసుకుని రావడానికి దర్శకుడు కిరణ్ కొర్రపాటి ఎంతగా కష్టపడ్డాడనేది నాకు తెలుసు. ఎన్ని సమస్యలు ఎదురైనా తట్టుకుని ఆయన ఈ సినిమాను ఇక్కడి వరకూ తీసుకుని వచ్చాడు. అందులో నిర్మాతల కృషి కూడా ఉంది. అందుకు వాళ్లందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను.

ఇది కేవలం తెలుగు సినిమా కాదు .. పాన్ ఇండియా సినిమా. ఎంటర్టైన్మెంట్ ఉంది .. ఎమోషన్ ఉంది .. అన్నిటికీ మించిన హార్డ్ వర్క్ ఉంది. ఈ సినిమాను థియేటర్లలో చూసే సమయం కోసం వెయిట్ చేస్తున్నాను. కరోనా లేదు .. మాస్క్ లేదు .. 'గని' ఉంది  .. సక్సెస్ కనిపిస్తోంది" అంటూ చెప్పుకొచ్చారు.