ఆ ఒక్క సీన్ వల్ల ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా: నాని

Fri Mar 17 2023 19:00:01 GMT+0530 (India Standard Time)

Nani About Dasara Movie Shoot

ఎప్పుడూ చేయని ఊర మాస్ క్యారెక్టర్ తో దసరా రూపంలో వస్తున్నాడు నాని. పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ మూవీలో ఇప్పటిదాకా కెరీర్ లో ఎప్పుడూ చేయనంత మాస్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ పాత్ర తనను మరో స్థాయికి తీసుకెళ్తుందని చాలా బలంగా నమ్ముతున్నాడు నాని. ఈ నెల 30వ తేదీన విడుదల కానుంది దసరా మూవీ.ఈ సినిమా కోసం నాని ప్రచార బాధ్యతలన్నీ భుజానికెత్తుకుని జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నాడు. యూట్యూబ్ ఛానల్స్ టీవీ ఛానళ్లకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ చాలా అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తున్నాడు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలు చెబుతున్నాడు.

ఈ క్రమంలో షూటింగ్ సమయంలో తనకు ఎదురైన ఓ భయానక అనుభవం గురించి చెప్పాడు. దసరా సినిమా షూటింగ్ వల్ల తాను 2 నెలల పాటు విపరీతంగా భయపడ్డానని నిద్ర కూడా పట్టలేదని నాని చెప్పాడు.

దసరా మూవీ సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో సాగే కథ అని అందరికీ తెలిసిందే. బొగ్గు గనులు డంపర్లు బొగ్గు లారీలతో ఉంటుంది మూవీ. ఇందులో ఓ సీన్ లో భాగంగా డంపర్ ట్రక్ బొగ్గును తీసుకెళ్లి డంప్ చేయాలని ఓ సీన్ ఉంది. ఈ సీన్ లో డంపర్ ట్రక్ నుండి పడిపోయిన నానిపై బొగ్గు పడాలి. ఆ తర్వాత ఆ బొగ్గులో నుండి నాని బయటకు రావాల్సి ఉంటుంది.

ఈ సీన్ కోసం డంపర్ లో బొగ్గుకు బదులుగా సింథటిక్ బొగ్గు వాడారు. అది మొత్తం దుమ్ముతో ఉంటుంది. ఆ సీన్ లో లెక్క ప్రకారమే నాని డంపర్ నుండి కిందపడిపోతాడు. ఆ తర్వాత తనపై సింథటిక్ బొగ్గు పడిపోతుంది. అయితే తనను బయటకు తీసేంత వరకు నాని ఊపిరి బిగబట్టుకుని ఉండాల్సి ఉంటుంది. ఒక వేళ శ్వాస పీల్చుకుంటే సింథటిక్ బొగ్గుల్లోని దుమ్ము అంతా శరీరంలోకి వెళ్లిపోతుంది. ఈ ఒక్క సీన్ ను చాలా రోజుల పాటు షూట్ చేశారట మేకర్స్.

ఈ సీన్ జరిగినన్ని రోజులు జరిగిన తర్వాత కొన్ని రోజుల పాటు నానికి ఈ సీన్ గుర్తుండి పోయిందని నాని చెప్పాడు. డంపర్ లో నుండి కిందపడటం తనపై బొగ్గు పడటం తనను పైకి లాగడం లాంటివన్నీ కొన్ని రోజుల పాటు గుర్తుకొచ్చేవంట. ఈ క్రమంలో తనకు తెలియకుండానే శ్వాసను బిగబట్టుకునే వాడినని అలా నిద్రపోవడం చాలా కష్టంగా ఉండేదని దాదాపు 2 నెలల పాటు ఆ భయం నుండి బయటపడలేక పోయానని నాని పేర్కొన్నాడు. ఇక ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో నేచురల్ గా కనిపించేందుకు ఆల్కహాల్ తాగి నటించినట్లు నాని చెప్పడం గమనార్హం.   


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.