Begin typing your search above and press return to search.

దసరా రోజున నందమూరి హీరోల సందడి

By:  Tupaki Desk   |   25 Sep 2021 11:30 PM GMT
దసరా రోజున నందమూరి హీరోల సందడి
X
విజయదశమి రోజున ఏ పని ప్రారంభించినా అది విజయాన్ని ఇస్తుందనే విశ్వాసం అందరిలోనూ ఉంది. అందువలన పండుగ రోజుల్లో ప్లాన్ చేసుకున్న సినిమాలు థియేటర్లలో దిగిపోతాయి. ఇక నిర్మాణ దశలో ఉన్న కొత్త సినిమాలకి సంబంధించిన పోస్టర్లు .. టీజర్లు .. ట్రైలర్లు .. ఫస్టు సింగిల్స్ .. ఆ రోజున పలకరిస్తాయి. తమ సినిమాల పొజీషన్ ను బట్టి మేకర్స్ ఏదో ఒక అప్ డేట్ ను వదులుతూ ఉంటారు. ఈ సారి విజయదశమి రోజున నందమూరి హీరోల సందడి ఎక్కువగా కనిపించనుందనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది.

బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి 'అఖండ' సినిమాను చేశాడు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాను, దసరా బరిలోనే దింపాలని చూశారు గానీ కుదరలేదు. అందువలన ఈ సినిమా నుంచి స్పెషల్ ట్రైలర్ నుగానీ, మరో లిరికల్ వీడియోనుగాని విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. అదే రోజున బాలయ్య - గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందనున్న సినిమాకి సంబంధించిన టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేయవచ్చని అంటున్నారు. ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ ఒక సినిమా చేయనున్నాడు. ఆ సినిమాకి సంబంధించిన ఎనౌన్స్ మెంట్ రావొచ్చని చెబుతున్నారు.

ఇటీవలే అనిల్ రావిపూడి .. బాలకృష్ణకు ఒక కథ చెప్పేసి ఆయనతో ఓకే అనిపించుకున్నాడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందనుంది. 'ఎఫ్ 3' పూర్తయిన తరువాత అనిల్ రావిపూడి చేసే సినిమా ఇదేనని అంటున్నారు. ఇక అదే రోజున కొరటాల శివ - ఎన్టీఆర్ కాంబినేషన్లో రూపొందనున్న సినిమా నుంచి టైటిల్ పోస్టర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ఈ పాటికే ఈ సినిమా పట్టాలెక్కవలసి ఉంది. అటు ఎన్టీఆర్ చేస్తున్న 'ఆర్ ఆర్ ఆర్' .. ఇటు కొరటాల చేస్తున్న 'ఆచార్య' కరోనా కారణంగా లేట్ కావడం వలన ఆ ప్రభావం కొత్త ప్రాజెక్టుపై పడింది.

గతంలో కొరటాల శివ - ఎన్టీఆర్ కాంబినేషన్లో 'జనతా గ్యారేజ్' సినిమా వచ్చింది. యాక్షన్ .. ఎమోషన్స్ కలిపేసి కొరటాల అందించిన ఈ కథ, ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. విడుదలైన ప్రతిచోట విజయవిహారం చేసింది. అందువలన సహజంగానే ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇక కల్యాణ్ రామ్ తన సొంత బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మించిన 'బింబిసార'ను జనం మరిచిపోయే పరిస్థితి వచ్చింది. అందువలన విజయదశమి రోజున ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇవ్వాలని భావిస్తున్నారట. ఇలా విజయదశమి రోజున నందమూరి హీరోలు ఒక రేంజ్ లో సందడి చేయనున్నారన్న మాట.