కల్యాణ్ రామ్ ప్రయోగాల వెనుక కలర్ఫుల్ ఫ్యామిలీ!

Wed Jul 06 2022 13:07:17 GMT+0530 (IST)

Nandamuri Kalyan Ram Family

నందమూరి ఫ్యామిలీ నుంచి చిత్రపరిశ్రమలో హీరోగా .. నిర్మాతగా కొనసాగుతున్నవాడిగా కల్యాణ్ రామ్ కనిపిస్తాడు. బలమైన కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన కల్యాణ్ రామ్ లో హీరోకి ఉండవలసిన లక్షణాలు పుష్కలంగానే కనిపిస్తాయి. అందువలన ఆయన కూడా ఆ దిశగా ముందుకు వెళుతూనే వస్తున్నాడు. అలా ఒక వైపున హీరోగా .. మరో వైపున నిర్మాతగా తన ప్రత్యేకతను చాటుతూనే ఉన్నాడు. ఇండస్ట్రీలోకి హీరోగా ఆయన అడుగుపెట్టేసి 20 ఏళ్లు అయింది.
సుదీర్ఘమైన ఈ ప్రయాణంలో ఆయన ఎన్నో ప్రయోగాలు చేస్తూ వెళుతున్నాడు.నిజం చెప్పాలంటే హీరోగాను .. నిర్మాతగాను కల్యాణ్  రామ్ కి లభించిన సక్సెస్ లు చాలా తక్కువ. అయినా ఈ విషయంలో ఆయన ఎప్పుడూ కూడా ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోవడానికి ప్రయత్నించినట్టుగా కనిపించదు. అలాగే నందమూరి ఫ్యామిలీ నేపథ్యం గురించి ఎక్కడా హైలైట్ చేస్తూ మాట్లాడినట్టుగా కూడా కనిపించదు. తన ప్రయత్నాలు తాను సీరియస్ గా .. సిన్సియర్ గా చేస్తూ వెళ్లడం కనిపిస్తుంది. ఫలితం ఏదైనా తాను మాత్రమే బాధ్యుడినని భావించి దానిని      అంగీకరించడం కనిపిస్తుంది.

కల్యాణ్ రామ్ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'బింబిసార' రెడీ అవుతోంది. మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మించాడు. రెండు కాలాల్లో నడిచే ఈ కథ కోసం ఆయన భారీస్థాయిలో ఖర్చు చేయడం విశేషం.

నిన్న ఆయన పుట్టినరోజు .. ఈ సందర్భంగా ఈ సినిమా పోస్టర్లు .. ట్రైలర్ సోషల్ మీడియాలో బాగానే సందడి  చేశాయి. అంతే కాదు బర్త్ డే సందర్భంగా ఫ్యామిలీతో కలిసి ఆయన దిగిన ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కల్యాణ్ రామ్ బయట ఫంక్షన్స్ లో ఎక్కడా కనిపించరు. ఇతర హీరోల సినిమాలను గురించిన విషయాలపై కూడా ఆయన స్పందించడు. తన సినిమా వేదికలపై తప్ప ఎక్కడా కనిపించడు. ఇక ఆయన ఫ్యామిలీతో కలిసి కనిపించిన సందర్భాలు కూడా చాలా తక్కువని చెప్పాలి .

అలాంటి కల్యాణ్ రామ్ తన బర్త్ డే సందర్భంగా భార్య .. ఇద్దరు పిల్లలతో కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. బ్యూటిఫుల్ ఫ్యామిలీ అంటూ నందమూరి అభిమానులు సోషల్  మీడియా ద్వారా తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయన 'బింబిసార' ఆగస్టు 5వ తేదీన విడుదలవుతున్న సంగతి తెలిసిందే.