Begin typing your search above and press return to search.

బాలయ్య టాక్ షోకు చిరు - నాగ్ గెస్టులుగా వస్తే..?

By:  Tupaki Desk   |   26 Jan 2022 3:30 AM GMT
బాలయ్య టాక్ షోకు చిరు - నాగ్ గెస్టులుగా వస్తే..?
X
నటసింహ నందమూరి బాలకృష్ణ ఎంట్రీతోనే హోస్టుగా ఓటీటీలో అదరగొట్టారు. మెగా ప్రొడ్యుసర్ అల్లు అరవింద్ సారధ్యంలో నడిచే 'ఆహా' డిజిటల్ ఫ్లాట్ ఫామ్ కోసం బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరించిన 'అన్ స్టాపబుల్' టాక్ షో సూపర్ సక్సెస్ అయింది. ఇప్పటివరకు స్ట్రీమింగ్ అయిన ప్రతీ ఎపిసోడ్ కూడా విశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంది. తెలుగు ఓటీటీలో ప్రసారమయ్యే ఈ టాక్ షో.. ఇంటర్నేషనల్ మూవీ డేటా బేస్ (IMDB) రేటింగ్స్‌ లో ఐదో స్థానాన్ని సాధించిందంటేనే ఇది ఎంత పాపులర్ అయిందో అర్థం చేసుకోవచ్చు.

బాలకృష్ణలో బయటకు తెలియని మరో కోణాన్ని ఆవిష్కరిస్తూ సాగిన ఈ టాక్ షో దెబ్బకు అందరి థింకింగ్‌ మార్చేసిందనే చెప్పాలి. ఆయనలోని మంచి తనాన్ని సేవా గుణాన్ని అందరికీ చాటి చెప్పింది. ఇందులో సినీ ప్రముఖులతో సీనియర్ హారో సంభాషించే విధానం.. చిన్న పిల్లాడిని గుర్తు చేసే బాలయ్య చేష్టలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తనపైనా తన సినిమాలపైనే సెటైర్లు వేసుకోడానికి అగ్ర కథానాయకుడు వెనకాడలేదు. తాను తాగే మందు బ్రాండ్ వంటి అంశాలను సైతం వెల్లడించారు.

వాస్తవానికి 'అన్ స్టాపబుల్' టాక్ షో అనౌన్స్ చేయగానే బాలయ్యతో షో ఏంట్రా బాబూ అనే కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. ఓ రేంజ్ లో ట్రోల్ చేయొచ్చని నెటిజన్స్ అనుకున్నారు. మీమ్ రాయుళ్లకు కావాల్సినంత స్టఫ్ దొరుకుంటుందని అన్నారు. అయితే 'ఆహా' ఓటీటీలో టాక్ షో స్ట్రీమింగ్ అయ్యాక అందరూ నోళ్లు వెళ్ళబెట్టారు. ట్రోల్ చేయడానికి రెడీగా ఉన్న నెటిజన్స్ సైతం ఇప్పుడు బాలయ్యను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. బాలయ్య అంటే ‘అన్ స్టాపబుల్’.. ‘అన్ స్టాపబుల్’ అంటే బాలయ్య అని అంటున్నారు.

‘అన్ స్టాపబుల్’ తొలి సీజన్‌ లో మంచు మోహన్ బాబు - మంచు లక్ష్మి - విష్ణు - నాని - బ్రహ్మానందం - అనిల్ రావిపూడి - సుకుమార్ - రష్మిక మందన్న - అల్లు అర్జున్ - బోయపాటి శ్రీను - శ్రీకాంత్ - రవితేజ - గోపీచంద్ మలినేని - రానా - పూరీ జగన్నాథ్ - విజయ్ దేవరకొండ - చార్మీ కౌర్ వంటి ప్రముఖులు గెస్టులుగా సందడి చేసారు. ఫిబ్రవరి 4న ప్రసారం కాబోయే సూపర్ స్టార్ మహేష్ బాబు పాల్గొనే చివరి ఎపిసోడ్ తో సీజన్-1 ముగియనుంది.

‘అన్ స్టాపబుల్’ సీజన్-2 కు కూడా బాలయ్యే హోస్టుగా ఉంటారని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. అయితే వచ్చే సీజన్ లో చిరంజీవి - నాగార్జున - వెంకటేష్ - పవన్ కళ్యాణ్ - ప్రభాస్ - ఎన్టీఆర్ - రామ్ చరణ్ వంటి హీరోలతో బాలకృష్ణ ఇంటర్వ్యూలు చేస్తే చూడాలని సినీ అభిమానులు ఆశ పడుతున్నారు. బాలయ్యకు అక్కినేని నాగార్జునకు పడదని ఇండస్ట్రీలో ఓ టాక్ ఉంది. పలు సందర్భాల్లో అవేమీ లేవని ఇరువురూ స్టేట్మెంట్స్ ఇచ్చినా పుకార్లకు ఫుల్ స్టాప్ పడలేదు. ఇప్పుడు ఆహా టాక్ షోలో వీరిద్దరూ కలిస్తే అన్నిటికీ తెర పడుతుందని అందరూ భావిస్తున్నారు.