బిగ్ బాస్ హిస్టరీలో తొలిసారి అలా.. షాకింగ్ న్యూస్ చెప్పిన నాగ్

Sun Sep 25 2022 09:56:43 GMT+0530 (India Standard Time)

Nagarjuna In Biggboss 6

ప్రపంచ వ్యాప్తంగా మోస్ట్ పాపులర్ రియాల్టీ షోలలో నెంబర్ వన్ గా నిలుస్తుంది బిగ్ బాస్. దేశం ఏదైనా..ప్రాంతం మరేదైనా.. భాష ఇంకేదైనా.. బిగ్ బాస్ కాన్సెప్టుకు జనాలు ఇట్టే కనెక్టు అయిపోవాల్సిందే. ఒకరికొకరు సంబంధం లేని కొంతమంది ఒక ఇంట్లో వంద రోజులు పాటు ఉండటం.. ఆ సందర్భంగా వారి చేత ఆటలు ఆడిస్తూ.. టాస్కులు ఇస్తూ.. ఎవరికి వారు వారి టాలెంట్ ను ప్రదర్శిస్తూ.. మిగిలిన వారిని కలుపుకుంటూ పోవటం.. తన మార్కును ప్రదర్శించటం లాంటివి చేస్తారో వారిని విజేతలుగా ఎంపిక చేసే బిగ్ బాస్ షో కు సంబంధించి..ఇప్పటివరకు ఎప్పుడూ.. ఎక్కడా లేని ఒక కొత్త తరహా పవర్ ను నాగ్ చేతికి ఇచ్చారు బిగ్ బాస్ సీజన్ 6లో.శనివారం టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ లో నాగ్ మాట్లాడుతూ.. బిగ్ బాస్ హిస్టరీలోనే తొలిసారిగా నామినేషన్ ప్రక్రియను హోస్ట్ కు కట్టబెట్టి.. ఒకరు కాదు ఏకంగా ఇద్దరిని నామినేట్ చేసే పవర్ ను తనకు ఇచ్చినట్లుగా నాగార్జున పేర్కొన్నారు. నిజానికి బిగ్ బాస్ షోలో ఎప్పుడు ఏ రూల్ వస్తుందో? మరే రూల్ పోతుందో? అస్సలు ఊహించలేం. అనూహ్య నిర్ణయాల్ని తీసుకోవటం.. అనూహ్యంగా వ్యవహరించటం లాంటివి బిగ్ బాస్ లో తరచూ కనిపిస్తూ ఉంటాయి.

తాజాగా అలాంటి నిర్ణయాన్నే ప్రకటించారు నాగార్జున. ఈ వారం తాను హౌస్ లో ఉన్న పోటీదారుల్లో ఇద్దరిని తానే నేరుగా నామినేట్ చేసేందుకు బిగ్ బాస్ తనకు పవర్ ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. శనివారం ఎపిసోడ్ ను చూస్తే.. ఆ వారంలో ఎవరు తప్పులు చేశారు? ఎవరు బాగా ఆడారు? అన్న విషయాన్ని చెబుతూ.. కొందరిని మెచ్చుకుంటూ.. మరికొందరికి క్లాసులు పీకారు. గత వారంలో వివాదాలుగా మారిన అంశాలకు సంబంధించిన వివరాల్ని.. వీడియోల రూపంలో చూపించి.. సందేహాల్ని క్లియర్ చేయటంతో పాటు.. తామే కరెక్టు అన్నట్లుగా వ్యవహరించే వారు తప్పులెన్ని చేశారన్న విషయాన్ని చెప్పేశారు.

హౌస్ లో ఉన్న వారి మాట తీరు.. ఆట తీరు.. మనిషి తీరు ఎలా ఉందో విశ్లేషిస్తూ.. వారికి మార్కులు ఇచ్చేశారు. అలా ఇచ్చిన వైనాన్ని చూసినప్పుడు..

-  బాలాదిత్య మాట తీరుకు 10 మార్కులు.. మనిషి తీరుకు 9 మార్కులు ఇచ్చి.. ఆట తీరుకు మాత్రం 3 మార్కులే ఇచ్చారు.

-  రోహిత్.. మెరీనా జంట మాట తీరుకు 10 మార్కులు ఇచ్చిన నాగ్.. ఆట తీరుకు మాత్రం 5 మార్కులే ఇచ్చారు.

-  చిన్న విషయాలకే కన్నీళ్లు పెట్టే కీర్తి ఆటతీరుకు 4 మార్కులు ఇవ్వగా.. సుదీప ఆట తీరుకు 4.. మాట తీరుకు 7 మార్కులు ఇచారు.

-  శ్రీసత్య ఆట తీరుకు 9 మార్కులు.. శ్రీహాన్ ఆట తీరుకు 9 మార్కులు ఇచ్చి.. మాట తీరుకు మాత్రం 7 మార్కులే ఇచ్చారు.

-  రేవంత్ ఆట తీరుకు 9 మార్కులు.. మాట తీరుకు 6.. మనిషి తీరుకు 7 మార్కులు ఇచ్చారు.

-  పైమా ఆట తీరుకు9 మార్కులు ఇచ్చారు.

-  చంటి మాట.. మనిషి తీరుకు 10 మార్కులు ఇచ్చి.. ఆట తీరుకు మాత్రం 5 మార్కులే ఇచ్చారు.

సోఫా వెనుక నిలబడిన 8 మందిలో తాను ఇద్దరిని నేరుగా వచ్చే వారం ఎలిమినేట్ కు నామినేట్ చేస్తున్నట్లు ప్రకటించి డబుల్ షాకిచ్చారు. బిగ్ బాస్ హిస్టరీలో ఇలా చేయటం ఇదే తొలిసారిగా పేర్కొన్నారు. ఎనిమిది మందిలో ఇద్దరిని నేరుగా ఎలిమినేట్ చేయటానికి నామినేట్ చేసే అవకాశాన్ని బిగ్ బాస్ తనకు ఇచ్చిన నేపథ్యంలో.. ఇంటి సభ్యుల నుంచి అభిప్రాయాల్ని సేకరించిన ఆయన.. ఎక్కువ ఓట్లు వచ్చిన అర్జున్.. కీర్తిలను నామినేట్ చేయటంతో ఎపిసోడ్ ముగిసింది.