తాతయ్య పై తారక్ ఎమోషనల్ ట్వీట్

Tue Jan 18 2022 12:06:29 GMT+0530 (IST)

NTR Emotional Tweet

జాతీయస్థాయిలో తెలుగువారికి గుర్తింపు తీసుకొచ్చిన మొట్ట మొదటి నటుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు  విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు అందించిన సేవల గురించి వర్ణించడం అనితరసాధ్యం. నటుడిగా..నిర్మాతగా...రాజకీయ నాయకుడిగా ఆయన చేసిన సేవలు ఎప్పటికీ  చిరస్మరణీయం. కాగా నేడు ఆయన 26వ వర్ధంతి. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆ మహానటుడిని గుర్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వర్ధంతి వేడుకలను ఎన్టీఆర్ అభిమానులు టీడీపీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.ఇక చిత్ర పరిశ్రమ నుంచి సోషల్ మీడియా వేదికగా అన్నగారిని స్మరించుకుంటున్నారు. తెలుగు పరిశ్రమకు..ప్రజలకు ఆయన చేసిన సేవల్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మనవడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్విటర్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.  ఎన్టీఆర్ ఫోటోని షేర్ చేస్తూ...`` తెలుగు ప్రజల గుండెల్లో.. నాటికి..నేటికి..ముమ్మాటికీ ..ధ్రువతార మీరే`` అంటూ రాసుకొచ్చారు. ఈ ఎమోషనల్ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఆ పోస్ట్ ని  చూసిన అభిమానులు సీనియర్ ..జూనియర్ ఎన్టీఆర్ ఫోటోల్ని పక్కపక్కనే పెట్టి మరింత వైరల్  గా మార్చారు.

తాతకు తగ్గ మనవడు పరిశ్రమని ఏల్తున్నాడంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక  మరో మనవడు నందమూరి కళ్యాణ్ జోహార్ ఎన్టీఆర్ ఆంటూ తాతయ్యకి నమస్కరించారు. అలాగే  ఎన్టీఆర్ దంపతుల పాత ఫ్రేమ్ తో ఉన్న  ఫోటోని షేర్ చేసారు. ఇంకా ఎన్టీఆర్ అభిమానులు..తెలుగు తమ్ముళ్లు సీనియర్ రామారావుతో తమకున్న అనుభందాన్ని...అనుభవాల్ని గుర్తు చేసుకుంటున్నారు. అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ బొమ్మలపై పాలభిషేకం చేస్తున్నారు.