నా బ్లడ్ బ్రదర్స్.. కరోనా బలిగొనడం దారుణంః చిరంజీవి

Wed Apr 21 2021 10:00:02 GMT+0530 (IST)

My Blood Brothers .. Corona death

మెగాస్టార్ చిరంజీవి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఇద్దరిని కరోనా బలిగొంది. కదిరి ప్రాంతానికి చెందిన ప్రసాద్ రెడ్డి హైదరాబాద్ కు వెంకటరమణ కొవిడ్ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు.ప్రసాద్ రెడ్డి వెంకటరమణ ఎంతో కాలంగా అభిమానులుగా ఉన్నారని తెలిపారు. తాను చేపట్టిన ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో వారిద్దరూ ముందుండి నడిచారని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు వారిద్దరూ లేరన్న విషయం హృదయాన్ని కలచి వేసిందని పేర్కొన్నారు.

ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వారిద్దరితో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేసిన చిరంజీవి.. ఆవేదనతో కూడిన కామెంట్ జతచేశారు. ‘‘ఎంతో కాలంగా అభిమానులు అన్ని సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే నా బ్లడ్ బ్రదర్స్.. కదిరి వాస్తవ్యులు ప్రసాద్ రెడ్డిగారు హైదరాబాద్ వాసి వెంకటరమణ గారు కరోనాబారిన పడి ఇక లేరనే వార్త నా హృదయాన్ని కలచివేసింది. వారి ఆత్మకు శాంతి కలగాలి. వారిరువురి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి’’ అని రాశారు.

ఇదిలా ఉండగా.. COVID-19 కేసులు అంతకంతకూ ఉధృతం అవుతుండడంతో.. ఆచార్య సినిమా షూటింగ్ నిలిపేశారు చిరంజీవి. ప్రభుత్వాలు ఎలాంటి ఆదేశాలు ఇవ్వక ముందే.. చిత్రీకరణ ఆపేశారు. కొవిడ్ కారణంగా నిలిచిపోయిన మొదటి షూట్ ఆచార్యదేనని సమాచారం.