Begin typing your search above and press return to search.

సీనియర్ డైరెక్టర్ కి ఎదురైన అవమానం .. అందుకే ఆ నిర్ణయం!

By:  Tupaki Desk   |   23 Sep 2022 12:30 AM GMT
సీనియర్ డైరెక్టర్ కి ఎదురైన అవమానం .. అందుకే ఆ నిర్ణయం!
X
తెలుగు సినిమాను దాసరి నారాయణ రావు .. రాఘవేంద్రరావు పరుగులు తీయిస్తున్న కాలంలోనే, తమదైన మార్క్ ను చూపించడానికి పోటీపడిన దర్శకుల జాబితాలో కోదండ రామిరెడ్డి .. కోడి రామకృష్ణతో పాటు ముత్యాల సుబ్బయ్య కూడా కనిపిస్తారు. ముత్యాల సుబ్బయ్య పేరు వినగానే 'కలికాలం' .. 'మామగారు' .. 'ఎర్రమందారం' .. 'హిట్లర్' .. 'గోకులంలో సీత' వంటి సినిమాలు .. అవి సాధించిన విజయాలు కళ్లముందు కదలాడతాయి. అలా ఆయన ఖాతాలో 50 సినిమాల వరకూ కనిపిస్తాయి. అలాంటి ఆయన 'ఆలీతో సరదాగా' వేదిక ద్వారా అనేక విషయాలను పంచుకున్నారు.

నేను పుట్టి పెరిగిందంతా ప్రకాశం జిల్లా కె. బిట్రగుంటలో. చదువు పూర్తయిన తరువాత నాటకాలు ఆడుతూ ఉండేవాడిని. స్నేహితుల ప్రోత్సాహంతో చెన్నై కి వెళ్లిన నేను, అవకాశాల కోసం అనేక కష్టాలు పడ్డాను. టి.కృష్ణగారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూ 'అరుణ కిరణం' సినిమాతో డైరెక్టర్ ను అయ్యాను.

అది మొదలు నేను ఎక్కువగా సినిమాలు చేసింది రాజశేఖర్ గారి తోనే. దాసరిగారు ఎంత గొప్ప దర్శకులనేది అందరికీ తెలిసిందే .. అలాంటి ఆయనతో 'మామగారు' సినిమాను 33 రోజుల్లో తీశాను. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందనేది ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు.

'హిట్లర్' సినిమా రీమేక్ గా వచ్చింది. ఆ సినిమా కోసం దర్శకుడిగా చాలామంది పేర్లను పరిశిలించారు. సెంటిమెంట్ సినిమా తీయాలంటే ముత్యాల సుబ్బయ్య తీయవలసిందే అంటూ నిర్మాతలు ఆ అవకాశాన్ని నాకు ఇప్పించారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక 'ఒక చిన్నమాట' ఫలితమే నన్ను బాగా బాధపెట్టింది. జగపతిబాబు హీరోగా చేసిన ఆ సినిమాలో, ఇంద్రజ హీరోయిన్. ఆ పాత్రకి సౌందర్య అయితే బాగుండేది .. కానీ ఆమెను తీసుకోవడం కుదరలేదు. చివరి నిమిషంలో కథలో మార్పులు చేయడం కూడా ఆ సినిమా సరిగ్గా ఆడకపోవడానికి కారణమైంది.

ఇండస్ట్రీలోను .. ప్రేక్షకుల్లోను ముత్యాల సుబ్బయ్యకి మంచి పేరు ఉంది. నా అనుభవం .. నేను సాధించిన విజయాలు ఆ గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. కానీ 2008లో ఒక సినిమా చేస్తుండగా ఒక నిర్మాత అవహేళనగా మాట్లాడాడు. అప్పుడు మాత్రం నా మనసుకు చాలా బాధ కలిగింది. కొంతమంది నచ్చజెప్పారు గానీ, ఇక సినిమాలకి దూరంగా ఉండటమే మంచిదని ఆ రోజునే నిర్ణయించుకున్నాను. ఈ రోజుల్లో సినిమా మరిన్ని మార్పులు చెందింది. సినిమా తీయడం ఒక ఎత్తయితే .. దానిని జనంలోకి తీసుకుని వెళ్లడం మరో ఎత్తయింది" అంటూ చెప్పుకొచ్చారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.