పవన్ 27 కు ముహూర్తం ఫిక్స్

Tue Jan 21 2020 16:50:56 GMT+0530 (IST)

Muhurtham Fixed For Pspk27

అజ్ఞాతవాసి పవన్ కళ్యాణ్ కెరీర్ లో 25వ చిత్రం అనే విషయం తెల్సిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రం ప్రేక్షకులను నిరాశ పర్చింది. ఆ సినిమా తర్వాత పలు సినిమాలకు అడ్వాన్స్ తీసుకున్నా కూడా రాజకీయాలతో పవన్ బిజీ అయ్యాడు. మళ్లీ పవన్ సినిమాల్లో నటించడం అనుమానమే అంటూ ప్రచారం జరిగింది. నిర్మాతల వద్ద తీసుకున్న అడ్వాన్స్ లు తిరిగి ఇచ్చేస్తున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. సినిమాల్లో నటిస్తాడో లేదో అనుకున్న పవన్ వరుసగా చిత్రాలు చేసేందుకు సిద్దం అయ్యాడు.ప్రస్తుతం తన 26వ చిత్రంగా 'పింక్' రీమేక్ ను చేస్తున్న విషయం తెల్సిందే. ఇటీవలే చిత్రీకరణ ప్రారంభం అయ్యింది. నిన్న పవన్ షూటింగ్ కు హాజరు అయ్యాడు. ఆ ఫొటోలు కూడా లీక్ అయ్యాయి. ఇక పవన్ తదుపరి చిత్రం గురించిన ప్రకటన కూడా వచ్చేసింది. ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వం లో ఏఎం రత్నం నిర్మాణం లో పవన్ తన 27వ చిత్రాన్ని చేయబోతున్నాడట.

పవన్ 27వ చిత్రంను ఈనెల 27న లాంచనంగా ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తోంది. క్రిష్ దర్శకత్వం లో పవన్ మూవీ అంటూ చాలా రోజులుగా ప్రచారం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఏకంగా డేట్ కూడా వచ్చేసింది. దాంతో సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో ఈ విషయమై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

అసలు సినిమాలు చేస్తాడో లేదో అనుకున్న పవన్ ఇలా వరుసగా చిత్రాలు చేయడం అది కూడా రాజకీయం గా రాజధాని విషయమై చాలా వేడి ఉన్న సమయంలో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలకు కమిట్ అవ్వడం ఆశ్చర్యంగా ఉందని అంతా అంటున్నారు. పవన్ 27వ చిత్రం అధికారిక ప్రకటన ఒకటి రెండు రోజుల్లో వస్తుందని ఒక ప్రముఖ పీఆర్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు.