Begin typing your search above and press return to search.

ఆగస్ట్ - సెప్టెంబర్ నెలల్లో థియేటర్లకు క్యూ కట్టనున్న సినిమాలు..!

By:  Tupaki Desk   |   16 Jun 2021 3:30 AM
ఆగస్ట్ - సెప్టెంబర్ నెలల్లో థియేటర్లకు క్యూ కట్టనున్న సినిమాలు..!
X
కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో సినిమా షూటింగులు నిలిచిపోయి.. థియేటర్లు మూతబడి ఉన్నాయి. అయితే ఇప్పుడిప్పుడే సినిమాలకు సంబంధించిన పనులు ప్రారంభమవుతున్నాయి. 'మ్యాస్ట్రో' 'శాకుంతలం' వంటి పెద్ద సినిమాల షూటింగ్స్ తిరిగి స్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలో మరికొన్ని చిత్రాలు సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీ అవుతున్నాయి. జూన్ నెలాఖరుకు ఇండస్ట్రీలో పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే థియేటర్స్ రీ ఓపెన్ అవడానికి మాత్రం ఇంకొంచెం సమయం పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు.

కోవిడ్ ప్రభావంతో ఏప్రిల్ రెండో వారం నుంచే ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గించేశారు. ఇప్పుడు కేసులు తగ్గుముఖం పట్టడం.. వ్యాక్సినేషన్ కార్యక్రమం విస్తృతంగా జరుగుతోంది. అయినప్పటికీ ప్రభుత్వం అప్పుడే సినిమాల స్క్రీనింగ్ కు అనుమతి ఇవ్వకపోవచ్చు. రాబోయే నెల రోజుల్లో ఉండే పరిస్థితులను బట్టి జూలై చివరి నుంచి థియేటర్లు తిరిగి ప్రారంభించడానికి పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంది. అది కూడా 50 శాతం ఆక్యుపెన్సీకి మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇవ్వొచ్చని ఎక్సపర్ట్స్ అంటున్నారు. ఇప్పటికే అక్షయ్ కుమార్ నటించిన 'బెల్ బాటమ్' చిత్రాన్ని జులై 27న వరల్డ్ వైడ్ బిగ్ స్పీన్స్ పై విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

టాలీవుడ్ లో కూడా ఆగస్ట్ ఫస్ట్ వీక్ నుంచి సినిమాలు క్యూ కట్టే అవకాశం ఉంది. ముందుగా కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో వాయిదా వేసుకున్న చిత్రాలు రిలీజ్ స్లాట్ కోసం పోటీ పడనున్నాయి. థియేటర్లు తెరిచిన వెంటనే జనాలు రావడం మొదలు పెడితే.. 'లవ్ స్టోరీ' 'టక్ జగదీష్' 'విరాట పర్వం' 'సీటీమార్' 'నారప్ప' 'రిపబ్లిక్' వంటి సినిమాలు ఆగస్టులోనే తెరపైకి వచ్చే ఛాన్స్ ఉంది. ప్యాచ్ వర్క్ మాత్రమే పెండింగ్ ఉన్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' 'పాగల్' వంటి చిత్రాలు సెప్టెంబర్ లో రావొచ్చు. 'రాధే శ్యామ్' వంటి పాన్ ఇండియా సినిమాలు మిగతా ఇండస్ట్రీలను కూడా పరిగణనలోకి తీసుకుని రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారు. మొత్తం మీద పరిస్థితులను బట్టి ఆగస్ట్ - సెప్టెంబర్ నెలలో చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.