దేశం వదిలిపోతున్న సినిమా స్టార్లు!

Thu Apr 22 2021 14:04:08 GMT+0530 (IST)

Movie stars leaving the country

కరోనా సెంకడ్ వేవ్ దారుణ పరిస్థితులను సృష్టిస్తోంది. ఒక రోజు నమోదైన కేసుల సంఖ్య ఏకంగా 3 లక్షలు దాటిపోయింది. దీంతో.. ప్రజలు వణికిపోతున్నారు. ప్రధాన నగరాల్లో పరిస్థితి భయానకంగా మారిపోయింది. ఈ పరిస్థితి సినిమా పరిశ్రమపైనా పడింది. ఇప్పటికే థియేటర్లు మూసేశారు. ఇక సినిమా షూటింగులు కూడా ఒకటి దాని తర్వాత మరొకటిగా నిలిచిపోతున్నాయి.కొన్ని సినిమాల యూనిట్లు ప్రస్తుత షెడ్యూల్ ను ఫినిష్ చేసి ఆపేద్దామని చూస్తున్నాయి. కానీ.. వాటికి ఆ ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు కొవిడ్. యూనిట్లలో కొవిడ్ కేసులు నమోదవుతుండడంతో.. అర్ధంతరంగా షూటింగులు నిలిపేస్తున్నారు. ఈ నెల చివరకు దాదాపు అన్ని సినిమాల షూటింగులు నిలిపేస్తారని సమాచారం. ఒకటీ అరా ఏమైనా ఉంటే.. మే ఫస్ట్ వీక్ నాటికి మొత్తం ఆపేస్తారని తెలుస్తోంది. దీంతో.. అందరూ ఇంటికే పరిమితం కానున్నారు.

అయితే.. కొందరు స్టార్ హీరోలు మాత్రం ఈ సమయంలో ఇళ్లలో కాదు.. దేశంలో ఉండడం కూడా శ్రేయస్కరం కాదని భావిస్తున్నారట. ఎలాగో సమ్మర్ సీజన్ లో ప్రతీఏడాది హాలిడే ట్రిప్ లు వేస్తుంటారు. కాబట్టి.. ఈ సారి ముందుగానే మేల్కొని వెళ్లిపోవాలని చూస్తున్నారట.

కరోనా ప్రభావం అత్యల్పంగా ఉన్న ప్రాంతాలను సెలక్ట్ చేసుకొని.. ఫ్యామిలీ మొత్తం అక్కడ వాలిపోవాలని ప్రణాళికలు వేసుకుంటున్నట్టు సమాచారం. ఇప్పుడున్న పరిస్థితి చక్కబడాలంటే.. జూన్ నెల వచ్చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో.. మే మొత్తం విదేశాల్లో గడిపేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.