Begin typing your search above and press return to search.

రేట్లు తగ్గిస్తే రెక్కలు కట్టుకుని వస్తారన్న మాట!

By:  Tupaki Desk   |   25 Sep 2022 10:53 AM GMT
రేట్లు తగ్గిస్తే రెక్కలు కట్టుకుని వస్తారన్న మాట!
X
కోవిడ్ సమయంలో ఓటీటీకి అలవాటు పడిపోయిన ప్రేక్షకులు, ఆ తరువాత థియేటర్లకు రావడం తగ్గించారు. కరోనా ఎఫెక్ట్ కారణంగా జనాల్లో ఇంకా భయం పోలేదు .. అందువలన రావడం లేదని ఇండస్ట్రీ వారు సర్ది చెప్పుకున్నారు. కానీ ఆ తరువాత మరింతగా జనల రాక తగ్గడంతో కంగారు పడిపోయారు. కొన్ని సినిమాలకి హౌస్ ఫుల్స్ పడితే, మరికొన్ని సినిమాలకి సంబంధించిన షోలు పది టిక్కెట్లు కూడా తెగక కేన్సిల్ అవుతున్నాయి. దాంతో కంటెంట్ ఉన్న సినిమాలకి జనాలు వస్తున్నారనే అభిప్రాయాన్నే ఖరారు చేసుకున్నారు.

అయితే వచ్చిన చిక్కల్లా అందరూ తమ సినిమాలో కంటెంట్ ఉందని నమ్మడమే .. ఆ విషయాన్ని జనానికి బలంగా చెప్పడానికి ప్రయత్నించడమే. తమ సినిమాను ఆదరించమని ప్రతి ఒక్కరూ చెబుతారు .. ఆదరించాలనే ప్రేక్షకులకు ఉంటుంది. కానీ డబ్బులు ఊరికే వస్తాయా? ఫ్యామిలీతో సినిమాకి వచ్చి .. సరదాగా పాప్ కార్న్ తింటూ సినిమా చూసే పరిస్థితి ఎంతమందికి ఉంది. అవసరాలే తీరని పరిస్థితుల్లో ఆనందాన్ని వెతుక్కోవడానికి థియేటర్లకు వచ్చే ధైర్యం ఎంతమందికి ఉంది? పెరిగిన టిక్కెట్ల రేట్లు .. థియేటర్లో తినుబండారాల రేట్లను సామాన్యుడు తట్టుకునే పరిస్థితి ఏది?

థియేటర్ లోపలోకి టిక్కెట్ తప్ప ఏమీ తీసుకుని పోనివ్వరు. వాటర్ బాటిల్ తో సహా అక్కడే కొనాలి. బయట రేట్లకి .. లోపల రేట్లకి సంబంధమే ఉండదు. అందువల్లనే జనాలు థియేటర్లకు రావడం తగ్గించారు. ఇలాంటి పరిస్థితుల్లోనే 'నేషనల్ సినిమా డే' ఈ నెల 23వ తేదీన దేశం మొత్తం మీద మల్టీ ప్లెక్స్ లలో 75 రూపాయలకే సినిమాను చూసే అవకాశం కల్పించారు. గవర్నమెంట్ జీవోలు .. లైసెన్సింగ్ విధానాల వలన తెలుగు రాష్ట్రాల్లో ఈ విధానం పెద్దగా వర్తించనప్పటికీ, మిగతా రాష్ట్రాల్లో థియేటర్లన్నీ కళకళలాడాయి.

ఈ అవకాశం వలన ఈ ఒక్క రోజునే 65 లక్షల టిక్కెట్లు అమ్ముడవడం విశేషం. అప్పట్లో శివరాత్రికి ఒక టిక్కెట్టుపై రెండు సినిమాలు చూపించేవారు. అందులో నుంచి వచ్చినదే అయినా, ఈ ప్లాన్ బాగానే వర్కౌట్ అయింది. చాలా థియేటర్స్ లో హౌస్ ఫుల్ బోర్డులు కనిపించాయి. ఈ కారణంగా చిన్న సినిమాలు కూడా ఆ రోజున మంచి వసూళ్లను సాధించాయి. రేట్లు తగ్గిస్తే జనాలు రెక్కలు కట్టుకుని వస్తారనే విషయాన్ని 'నేషనల్ సినిమా డే' నిరూపించిందనేది వాస్తవం. థియేటర్లలో రెండు వారాలు దాటిన సినిమాలకి ఇలాంటి ఒక స్కీమ్ పెట్టడం వలన మంచి ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమా అనేది సామాన్యుడికి అందుబాటులో ఉన్నప్పుడే సక్సెస్ కి అందుబాటులో ఉంటుందనే విషయాన్ని మరిచిపోకూడదు.