Begin typing your search above and press return to search.

జ్యోతిక సినిమా వచ్చేసింది.. ఫీడ్ బ్యాక్ ఏంటి?

By:  Tupaki Desk   |   29 May 2020 10:50 AM GMT
జ్యోతిక సినిమా వచ్చేసింది.. ఫీడ్ బ్యాక్ ఏంటి?
X
పొన్ మగల్ వందాల్.. కొంత కాలంగా సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో చర్చనీయాంశం అవుతున్న సినిమా. లాక్ డౌన్ నేపథ్యంలో దక్షిణాదిన థియేట్రికల్ రిలీజ్ లేకుండా నేరుగా ఓటీటీ ఫ్లాట్ ఫాంలో విడుదలకు సిద్ధమైన తొలి పేరున్న సినిమా ఇదే. అమేజాన్ ప్రైంలో నిన్న అర్ధరాత్రి 12 గంటల నుంచి ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది. సూర్య నిర్మించడం.. జ్యోతిక ప్రధాన పాత్రలో నటించడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.

ఇలాంటి పేరున్న సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయడం పట్ల థియేటర్ల యాజమాన్యలు గొడవ కూడా చేశారు. అన్ని అడ్డంకులనూ దాటుకుని ‘పొన్ మగల్ వందాల్’ ఆన్ లైన్లో రిలీజైపోయింది. ఈ సినిమా ఫీడ్ బ్యాక్ కోసం జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటు సమీక్షకులతో పాటు అటు సామాన్య ప్రేక్షకులూ సినిమా చూసి రివ్యూలు ఇచ్చేస్తున్నారు.ఓవరాల్‌గా చూస్తే ‘పొన్ మగల్ వందాల్’ మరీ గొప్ప సినిమా ఏమీ కాదు. అలాగని తీసిపడేయదగ్గదీ కాదు.

దీనికి మోడరేట్ రివ్యూలు వస్తున్నాయి. ఫిలిం సెలబ్రెటీలు, పీఆర్వోలు ఈ సినిమా గురించి ఆహా ఓహో అంటూ ట్వీట్లు వేస్తున్నారు. రివ్యూలు ఇస్తున్నారు. కానీ సమీక్షకులు, ప్రేక్షకులు మాత్రం సినిమా పర్వాలేదని మాత్రమే అంటున్నారు. కథాంశం హార్డ్ హిట్టింగ్‌గా అనిపించేదే అయినా.. దాన్ని నరేషన్ ఆశించినంత పకడ్బందీగా లేదంటున్నారు. పెద్దగా ట్విస్టులేమీ లేవని.. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లే కథ నడుస్తుందని చెబుతున్నారు.

ఐతే ప్రస్తుత సమాజంలోని ఒక బర్నింగ్ ఇష్యూను తీసుకుని.. దాని గురించి బలమైన సందేశం ఇచ్చారని.. అదే సినిమాలో హైలైట్ అని.. స్క్రీన్ ప్లే ఇంకొంచెం పకడ్బందీగా ఉంటే సినిమా స్థాయి వేరుగా ఉండేదని.. అయినప్పటికీ ఒకసారి ఈ సినిమా చూసేందుకు ఇబ్బంది లేదని సమీక్షకులు చెబుతున్నారు. జ్యోతిక, పార్తీబన్, భాగ్యరాజ్‌ల పెర్ఫామెన్స్ సూపర్ అని.. సాంకేతిక ఆకర్షణలు కూడా బాగున్నాయని.. కొత్త దర్శకుడు జేజే ఫ్రెడరిక్‌కు పాస్ మార్కులు పడతాయని తీర్పిచ్చారు రివ్యూయర్స్.