మోహన్ లాల్ 'మరక్కార్' న్యూ రిలీజ్ డేట్ ఖరారు..!

Fri Jun 18 2021 14:00:01 GMT+0530 (IST)

Mohanlal Marakkar new release date finalized

మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ నుండి దీర్ఘకాలంగా విడుదల కాకుండా ఉన్నటువంటి చిత్రం మరక్కర్ అరబికడలింటే సింహా(తెలుగులో మరక్కార్ అరేబియా సముద్ర సింహం). తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ బయటికి వచ్చింది. ఈ సినిమా ఆగస్టు 12న ఓనం ఫెస్టివల్ సందర్భంగా థియేటర్లలోకి రానుంది. స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన మరక్కర్ చిత్రం 16వ శతాబ్దం నేపథ్యంలో కొనసాగే హిస్టోరికల్ వార్ డ్రామా. ఈ చిత్రం గతేడాది మార్చి 26న విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.ఈ యుద్ధనాటక చిత్రం విడుదల కాకముందే మూడు జాతీయ అవార్డులను గెలుచుకుంది. కొంతకాలంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. మరక్కార్ ఈ ఏడాది మే 13న మాలిక్‌తో కలిసి విడుదల కావాల్సింది. అయితే కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా మరోసారి విడుదల వాయిదా పడింది. సుధీర్ఘ చర్చల తరువాత జూన్ 18న అంటే ఈరోజు మరక్కార్ మూవీ న్యూ రిలీజ్ డేట్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు మోహన్ లాల్. మొత్తానికి మరక్కర్ ఓనం పండుగ సందర్భంగా ఆగస్టు 12న థియేటర్లలో విడుదల కానుందని పోస్టర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్.

మోహన్ లాల్ మలయాళంలో పోస్ట్ చేస్తూ.. "రాబోయే ఆగస్టు 12న ఓనం ఫెస్టివల్ సందర్బంగా 'మరక్కర్ అరేబియా సముద్ర సింహం' మూవీని మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎదురు చూస్తున్నాం. మీ ప్రార్థనలు అలాగే మద్దతు ద్వారా ఇది సాధ్యం కాబోతుంది." అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సినిమాను ప్రియదర్శిన్ తెరకెక్కించగా.. ఆంటోనీ పెరుంబవూర్ నిర్మించారు. ఈ చిత్రానికి 2019లోనే సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ పొందింది. అందుకే 2019 జాతీయ చలన చిత్ర అవార్డులకు ఎంపికైంది.

ఆ విధంగా ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ మరియు బెస్ట్ కాస్ట్యూమ్ విభాగాలలో నేషనల్ అవార్డులు గెలుచుకుంది. నేవీ కమాండర్ కుంజలి మరక్కర్ కథ ఆధారంగా మరక్కర్ తెరకెక్కింది. ఈ చిత్రంలో మోహన్ లాల్ తో పాటు మంజు వారియర్ కీర్తి సురేష్ - ప్రణవ్ మోహన్ లాల్ - అర్జున్ సర్జా - సునీల్ శెట్టి - ప్రభు - సిద్దిక్ - నేదుముడి వేణు కీలకపాత్రల్లో నటించారు. ఇప్పటివరకు 100కోట్లు పైగా బడ్జెట్ పెట్టి నిర్మించిన మలయాళం చిత్రం ఇదే అంటూ టాక్ నడుస్తుంది. చూడాలి మరి ఆగష్టు 12న మోహన్ లాల్ మరక్కార్ గా ఎలాంటి రికార్డులు సృష్టిస్తారో..!