Begin typing your search above and press return to search.

మినీ రివ్యూ: '99 సాంగ్స్'

By:  Tupaki Desk   |   16 April 2021 12:58 PM GMT
మినీ రివ్యూ: 99 సాంగ్స్
X
ఆస్కార్ విజేత ఎ.ఆర్‌.రెహమాన్ తన సంగీతంతో కోట్లాది సంగీత ప్రియుల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నాడు. అయితే ఆయనలో కేవ‌లం సంగీత ద‌ర్శ‌కుడే కాకుండా మంచి క‌థకుడు కూడా ఉన్నారని తెలుస్తోంది. రెహమాన్ రచించిన స్టోరీతో ''99 సాంగ్స్‌'' అనే సినిమా రూపొందిన విషయం తెలిసిందే. రెహమాన్ నిర్మిస్తున్న సినిమా కావడంతో విడుదలకు ముందే దీనిపై ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. ఇప్ప‌టికే ప‌లు ఫిలిం ఫెస్టివల్స్ లో ప్ర‌ద‌ర్శిత‌మైన ఈ సినిమా.. ఈరోజు శుక్రవారం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. రెహమాన్ బ్రాండ్ తో వచ్చిన ఈ సినిమా మెప్పించిందో లేదో ప్రేక్షకుల అభిప్రాయాలను బట్టి తెలుసుకుందాం!

'99 సాంగ్స్' కథ విషయానికొస్తే.. హీరోకి చిన్నప్పటి నుంచే సంగీతమంటే ప్రాణం. మ్యూజిక్ అంటే స‌దాభిప్రాయం లేని అతని తండ్రి సంగీతం మ‌న జీవితాల్నే నాశ‌నం చేసిందని చెప్పినా.. ఆయనకు తెలియకుండా సంగీత సాధన చేస్తాడు. ఒక పాట ప్రపంచాన్ని మార్చేస్తుందని నమ్మే హీరో.. ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో ప్రేమలో పడతాడు. అతనికి తన కూతురునిచ్చి పెళ్లి చేయడానికి ఇష్టపడని ఆయన.. 'ఒక్క పాట కాదు.. వంద పాటలు చేసి సమాజాన్ని ఎలా ప్రభావితం చేయగలవో చూస్తాన'ని హీరోకు ఛాలెంజ్ విసురుతాడు. అలా సంగీత ప్ర‌యాణం మొద‌లుపెట్టిన హీరో జీవితంలో ఎలాంటి సంఘటనలు ఎదుర‌య్యాయి? అసలు అతని తండ్రికి మ్యూజిక్ అంటే ద్వేషం ఎందుకు? ఒక్క పాటతో ప్రపంచాన్ని మార్చేయొచ్చనే అతని ఆశయం నెరవేరిందా? తను ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుంటాడా? అన్నదే ఈ సినిమా కథ.

మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ రాసిన కథ కావడంతో అందరికీ ఇది మ్యూజికల్ బేస్డ్ మూవీ అనే భావన కలుగుతుంది. అయితే ఈ సినిమా చూసిన ఆడియన్స్ ఇందులో అంతకు మించిన కథే ఉందని చెబుతున్నారు. అయితే ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతంపై ప్రేమ‌తో ఓ మంచి క‌థ‌ని రాసుకున్నా.. ఆ క‌థ‌కి త‌గ్గ‌ట్టుగా క‌థ‌నం లేదని అంటున్నారు. కథను ఆసక్తికరంగా చూపించడంలోనూ దర్శకుడు విశ్వేష్ కృష్ణమూర్తి విఫలమయ్యారని టాక్ నడుస్తోంది. అలానే రెహమాన్ నుంచి ఆశించే హృదయాలను కదిలించే ఒక్క సాంగ్ కూడా ఇందులో లేకపోవడం ప్రేక్షకులను నిరాశపరుస్తోంది. చివ‌ర్లో క‌థ‌ని మ‌లుపు తిప్పే పాట‌లో భావం త‌ప్ప మ్యూజిక్ లో ఏమి మ్యూజిక్ లేదని తెలుస్తోంది.

ఇకపోతే రెహమాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ - సౌండ్ డిజైనింగ్.. తనయ్ - జేమ్స్ కౌలీ సినిమాటోగ్రఫీకి మంచి మార్కులు పడుతున్నాయి. అలానే కొత్త న‌టీన‌టులైన ఇహాన్ భట్ - ఎడిల్సీ వ‌ర్గ‌స్‌ నటనను మెచ్చుకుంటున్నారు. మ‌నీషా కొయిరాలా - లీసా రే వంటి స్టార్స్ ఉన్నా వారికి పెద్దగా ప్రాధాన్యం లేదని తెలుస్తోంది. సినిమాలో డైలాగ్స్ అలరిస్తున్నాయి. నిర్మాణ విలువ‌లు ఉన్న‌తంగా ఉన్నాయి. మొత్తం మీద క‌థ‌కుడిగా రెహ‌మాన్‌ కి మంచి మార్కులే పడినా.. డైరెక్టర్ విశ్వేష్ కృష్ణ‌మూర్తి క‌థ‌నం పెద్ద‌గా ప్ర‌భావం చూపించ‌లేక‌పోయిందని ప్రేక్షకులు చెబుతున్నారు.