Begin typing your search above and press return to search.

మిమిక్రీ ఆర్టిస్ట్ హరికిషన్ ఇకలేరు...!

By:  Tupaki Desk   |   23 May 2020 12:00 PM GMT
మిమిక్రీ ఆర్టిస్ట్ హరికిషన్ ఇకలేరు...!
X
టాలీవుడ్‌‌ లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్, నటుడు హరికిషన్ కన్నుమూశారు. హరికిషన్ వయస్సు 57 ఏళ్లు కాగా.. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. సికింద్రాబాద్‌ లోకి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా ఆయన చనిపోయినట్టు ఆయన సన్నిహితులు తెలియజేశారు. హరికిషన్ పిల్లలు ఆస్ట్రేలియాలో ఉండటంతో వాళ్లు వచ్చేందుకు ఆలస్యం అయ్యే అవకాశం ఉండటంతో బాడీని మార్చురీకి తరలించారు.

అలనాటి తెలుగు హీరోలు ఎన్టీఆర్ - ఏఎన్నార్ - కృష్ణ - శోభన్ బాబుల నుంచి చిరంజీవి - బాలకృష్ణ - నాగార్జున - వెంకటేష్ వరకు అందరి వాయిస్ లను హరికిషన్ మిమిక్రీ చేసేవాడు. అంతేకాకుండా నేటితరం హీరోలైన ఎన్టీఆర్ - పవన్ కళ్యాణ్ - మహేష్ బాబు - ప్రభాస్ ల వరకు అందరి హీరోల గొంతులను కూడా అనుకరించారు. వీరితో పాటు పలువురు రాజకీయ నాయకులు.. చంద్రబాబు - కేసీఆర్ - స్వర్గీయ వైయస్ ఆర్ గొంతులను సైతం మిమిక్రీ చేయగలిగిన ఆర్టిస్ట్ హరికిషన్ అని చెప్పవచ్చు.

హరికిషన్ చిన్నతనం నుంచే ఆయన గురువుల్ని.. తోటివారి వాయిస్ లని మిమిక్రీ చేస్తూ ఉండేవారంట. ఆ తర్వాత సినిమా స్టార్స్ - పొలిటికల్ లీడర్స్ - క్రీడాకారులు - గాయకుల గొంతులను అనుకరించేవారు. అంతేకాకుండా పక్షులు జంతువుల గొంతులను కూడా మిమిక్రీ చేసి మిమిక్రీ రంగంలో ఆయనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన మరణం తీరని లోటని చెప్పవచ్చు. కాగా సీనియర్ నటి వాణీశ్రీ కుమారుడు చనిపోయిన వార్తతో సినీ ప్రముఖులలో తీవ్ర విషాదం అలుముకుంది. అదే రోజు మరో కళాకారుడు కూడా మరణించడం మరింత బాధాకరమనే చెప్పాలి.