ఆస్కార్ తో మిలియన్ డాలర్ పిక్చర్

Sat Mar 18 2023 11:39:38 GMT+0530 (India Standard Time)

Million Dollar Picture with Oscar

ఆస్కార్ - నాటు నాటు ఫీవర్ ఇంకా తగ్గలేదు. నాటు నాటు తెలుగు పాటకు ఆస్కార్ వచ్చిన ఆనందంలో మొత్తం దేశం పులకించిపోతోంది. అకాడమీ వేదికపై ఆస్కార్ అవార్డు అందుకున్న క్షణాలు దానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రతి ఒక్కటీ భారతీయ సినీ ప్రేక్షకులకు ముఖ్యంగా తెలుగు సినీ అభిమానులకు ఎంతో ప్రత్యేకమైనవి. ఆస్కార్ నాటి ఫోటోలు రోజూ సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి.అలాంటి ఒక అరుదైన ఫోటోను కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ తన అఫీషియల్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేశాడు. మిలియన్ డాలర్ పిక్చర్ అంటూ దానికి క్యాప్షన్ కూడా ఇచ్చాడు. నాకు ఇష్టమైన వారితో వారు సంతోషంగా ఉన్న సమయం నా జీవితంలో మర్చిపోలేని రోజు అంటూ రాసుకొచ్చాడు ప్రేమ్ రక్షిత్ మాస్టర్. దీంతో పాటు మూడు రెడ్ కలర్ హార్ట్ సింబల్స్ ఉంచాడు. రాజమౌళి చంద్రబోస్ ఎంఎం కీరవాణిలను ట్యాగ్ చేశాడు.

ఈ పిక్ లో ఆర్ఆర్ఆర్ డైరెక్టర్ రాజమౌళి సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి గీతా రచయిత చంద్రబోస్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ ఉన్నారు. నాటు నాటు పాటకు ఒరిజనల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ వచ్చిన అనంతరం కీరవాణి తన ఆస్కార్ ప్రతిమను రాజమౌళి చేతిలో పెట్టగా.. చంద్రబోస్ తన ఆస్కార్ ప్రతిమను ప్రేమ్ రక్షిత్ చేతిలో పెట్టాడు.

ఆ సమయంలో వారంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆస్కార్ వచ్చిన క్షణాలను ఆస్వాదిస్తూ కనిపించారు. ఈ ఫోటోను పంచుకున్న ప్రేమ్ రక్షిత్ ఈ సమయాన్ని తన జీవితంలో మర్చిపోలేనిదిగా అభివర్ణించాడు.

గత ఆదివారం లాస్ ఏంజిల్స్ వేదికగా జరిగిన ఆస్కార్ వేడుకల్లో నాటు నాటు పాటకు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. ప్రపంచ ప్రఖ్యాత గాయకులు లేడీ గాగా పాడిన హోల్డ్ మై హ్యాండ్ రిహన్నా పాడి లిఫ్ట్ మి అప్ డయాన్ వారెన్స్ పాడిన అప్లాజ్ మిట్క్సీ డేవిడ్ బైర్న్ యొక్క దిస్ ఈజ్ ఎ లైఫ్ పాటలను వెనక్కి నెట్టి మరీ ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ అందుకుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.