మేఘ ఆకాశ్ అదృష్టాన్ని ఏ సినిమా తేల్చేస్తుందో!

Thu May 13 2021 05:00:01 GMT+0530 (IST)

Megha Akash new movie

మేఘ ఆకాశ్ .. అప్పుడే విరిసిన పొన్నాగి పూవులా .. కాడమల్లెలా విచ్చుకున్న కళ్లతో అందంగా అనిపిస్తుంది. అందానికి అమాయకత్వం తోడైతే ఆ అందం ఇంకా అందంగా ఉంటుందని ఒక కవిగారు సెలవిచ్చినట్టుగా కనిపిస్తుంది. సాధారణంగా కొత్త హీరోయిన్స్ వెంటవెంటనే ఒకే హీరోతో సినిమాలు చేయరు. కానీ మేఘ ఆకాశ్ .. నితిన్ తో 'లై' .. 'ఛల్ మోహన్ రంగ' సినిమాలు చేసింది. దురదృష్టవశాత్తు ఈ రెండు సినిమాలు కూడా పరాజయం పాలయ్యాయి. దాంతో సహజంగానే ఈ అమ్మాయి జోరుకు బ్రేకులు పడ్డాయి.ఆ తరువాత నుంచి మేఘ ఆకాశ్ .. తమిళ సినిమాలపై ఎక్కువ ఫోకస్ చేస్తూ వెళుతోంది. ఈ నేపథ్యంలోనే మళ్లీ తెలుగు నుంచి ఆమెకి కొన్ని అవకాశాలు వెళ్లాయి. తెలుగులో ఆమె శివ కందుకూరి జోడీగా 'మను చరిత్ర' చేసింది. అలాగే నాగ శేఖర్ దర్శకత్వంలో 'గుర్తుందా శీతాకాలం' .. శ్రీవిష్ణు సరసన 'రాజ రాజ చోళ' చేసింది. హసిత్ గోలి ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించాడు. ఈ మూడు సినిమాలను ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారు.

ఇక మేఘ ఆకాశ్ ప్రధాన పాత్రధారిగా 'డియర్ మేఘ' రూపొందడం విశేషం. ఈ సినిమాకి సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాల్లో 'రాజ రాజ చోర' .. 'డియర్ మేఘ' సినిమాల పట్లనే కుర్రాళ్లు కాస్త ఆసక్తితో ఉన్నారు. ఈ రెండు సినిమాల్లో మేఘ ఎలాంటి పాత్రలను పోషించింది? ఎంతవరకూ అలరిస్తుంది? అనేది మాత్రం తెలియదు. సాధ్యమైనంత త్వరగా ఆమె స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కొట్టేయాలి .. హిట్ పట్టేయాలి. అప్పుడే ఆమె కెరియర్ ఊపందుకునే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. ఇప్పటికైనా పట్టుచిక్కించుకోకపోతే జారిపోవడం ఖాయమనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.