Begin typing your search above and press return to search.

మెగాస్టార్ మ‌లేసియా టూర్‌ అందుకేనా?

By:  Tupaki Desk   |   28 May 2022 12:17 PM GMT
మెగాస్టార్ మ‌లేసియా టూర్‌ అందుకేనా?
X
మెగాస్టార్ చిరంజీవి ఉన్న‌ట్టుండి మ‌లేషియాకు ప‌య‌న‌మ‌య్యారు. ఇంత‌కీ ఆయ‌న మ‌లేషియాకు ఎందుకు వెళుతున్నారు? అక్క‌డ ఏం చేయ‌బోతున్నారు? అన్న‌ది ఇప్ప‌డు ఆస‌క్తిక‌రంగా మారింది. స్పెష‌ల్ ఆప‌రేష‌న్ కోసం వెళుతున్నారా? .. ఇంత‌కీ ఆ ఆప‌రేష‌న్ ఏంటీ? అనే ఆస‌క్తిక‌ర చ‌ర్చ అభిమానుల్లో మొద‌లైంది. వివ‌రాల్లోకి వెళితే.. దాదాపు రెండేళ్ల విరామం త‌రువాత మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య‌' చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు. స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ డైరెక్ట్ చేసిన ఈ మూవీ భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైంది.

అయితే అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగా ప్రేక్ష‌కుల్ని, అభిమానుల్ని ఆక‌ట్టుకోలేక‌పోయింది. ఒక్క ముక్క‌లో చెప్పాలంటే మెగాస్టార్ చిరంజీ, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తొలిసారి కలిసి న‌టించిన ఈ మూవీ తీవ్ర నిరాశ‌ను మిగిల్చి చిరు కెరీర్ లోనే అత్యంత డిజాస్ట‌ర్ గా నిలిచింది. ఈ నేప‌థ్యంలో ఈ సినిమా నుంచి త్వ‌ర‌గా బ‌య‌ట‌ప‌డాల‌ని చిరంజీవి వెంట‌నే త‌న నెక్ట్స్ సినిమాకు వెళ్లిపోయారు. ఆయ‌న హీరోగా బాబీ డైరెక్ష‌న్ లో ఓ భారీ మూవీ రూపొందుతోంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై న‌వీన్ ఎర్నేని, వై. ర‌విశంక‌ర్ ఈ మూవీని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.

చిరుకు జోడీగా క్రేజీ హీరోయిన్ శృతిహాస‌న్ న‌టిస్తున్న ఈ మూవీకి 'వాల్తేరు వీర‌య్య‌' అనే టైటిల్ ని ఫైన‌ల్ చేపిన‌ట్టుగా వార్త‌లు విపిస్తున్నాయి. ఇప్ప‌టికే దాదాపుగా 30 శాతం చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుంది.

యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్న ఈ మూవీ త‌దుప‌రి షెడ్యూల్ మ‌లేసియాలో ప్రారంభం కాబోతోంది. జూన్ మొద‌టి వారంలో చిరంజీవి, ద‌ర్శ‌కుడు బాబీ అండ్ టీమ్ మ‌లేషియా ప‌య‌నం కాబోతున్నారు. దాదాపు 20 రోజుల పాటు కీల‌క ఘ‌ట్టాల చిత్రీక‌ర‌ణ‌ని అక్క‌డ ప్లాన్ చేసిన‌ట్టుగా తెలుస్తోంది.

సినిమాలో హీరో సీక్రెట్ ఆప‌రేష‌న్ కోసం మ‌లేషియా వెళ‌తార‌ట‌. దానికి సంబంధించిన ఎపిసోడ్ నే జూన్ లో ప్లాన్ చేస్తున్నారు ద‌ర్శ‌కుడు బాబి. ప్ర‌స్తుతం వెకేష‌న్ లో వున్న మెగాస్టార్ చిరంజీవి తిరిగి హైద‌రాబాద్ వ‌చ్చాక మోహ‌న్ రాజా డైరెక్ష‌న్ లో 'లూసీఫ‌ర్‌' కు రీమేక్ గా చేస్తున్న 'గాడ్ ఫాద‌ర్‌' కోసం ఓ సాంగ్ లో పాల్గొని ఆ త‌రువాత మ‌లేసియా ప‌య‌నం కానున్నార‌ట‌. ఈ మూవీలోని కీల‌క అతిథి పాత్ర‌లో మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

మాస్ రాజాకు జోడీగా కేథ‌రిన్ క‌నిపించ‌బోతోంది. ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో ర‌వితేజ ఇందులో క‌నిపించ‌నున్నార‌ట‌. త‌న పాత్ర‌కు వాల్తేరు వీర‌య్య‌కు ఉన్న సంబంధం ఏంటీ? అత‌ని కోసం వాల్తేరు వీర‌య్య ఏం చేశాడు అన్న‌దే ఈ చిత్ర ప్ర‌ధాన ఇతివృత్త‌మ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం. దేవి శ్రీ‌ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేక‌ర్స్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన చిరు ప్రీ లుక్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది.