మెగాస్టార్ ఆ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేశారా..?

Thu May 26 2022 08:00:01 GMT+0530 (IST)

Megastar Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల కాలంలో వరుస సినిమాలు లైన్ లో పెడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. సీనియర్ హీరో అనౌన్స్ చేసిన చిత్రాల్లో యువ దర్శకుడు వెంకీ కుడుముల ప్రాజెక్ట్ కూడా ఉంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని ప్రకటించారు.'ఛలో' 'భీష్మ' చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వెంకీ.. మెగాస్టార్ కు వీరాభిమాని. తన ఫేవరేట్ హీరోతో వర్క్ చేసే అవకాశం రావడంతో ఎంతో ఉత్సాహంగా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు. కేవలం రెండు సినిమా అనుభవం ఉన్న దర్శకుడు.. చిరు ని డైరెక్ట్ చేసే గోల్డెన్ ఛాన్స్ అందుకున్నారని అందరూ అనుకున్నారు.

అయితే ఇప్పుడు అసలు ఈ ప్రాజెక్ట్ ఉంటుందో లేదో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అఫీషియల్ అనౌన్స్ మెంట్ తర్వాత ఈ మెగా మూవీకి సంబంధించిన ఎలాంటి అప్డేట్ లేదు. మిగతా సినిమాలన్నీ ఏదొక న్యూస్ తో వార్తల్లో నిలుస్తున్నాయి కానీ.. వెంకీ మూవీ గురించి ఎలాంటి సందడి లేదు.

ఇక లేటెస్టుగా 'ఆచార్య' సినిమాతో బిగ్గెస్ట్ ప్లాప్ అందుకున్నారు చిరంజీవి. దీంతో అప్రమత్తమైన మెగాస్టార్.. కథ - స్క్రిప్ట్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నారని టాక్. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి వెంకీ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేశారని రూమర్స్ వస్తున్నాయి.

ఇప్పటికే వెంకీ కుడుముల రెండు నేరేషన్స్ ఇచ్చినా.. చిరు సైడ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదట. అందుకే ఇప్పుడు ఈ సినిమా ఆగిపోయినట్లు పుకార్లు పుట్టుకొచ్చాయి. మరి త్వరలోనే ఈ మూవీకి సంబంధించి ఏదైనా అప్డేట్ ఇచ్చి..  రూమర్స్ కు చెక్ పెడతారేమో చూడాలి.

 చిరంజీవి ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ సినిమాలో నటిస్తున్నారు. 'లూసిఫర్' కి రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ - నయనతార - సత్యదేవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ మరియు సూపర్ గుడ్ ఫిలింస్ సంస్థలు కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.

అలానే మెహర్ రమేష్ దర్శకత్వంలో 'భోళా శంకర్' అనే సినిమా చేస్తున్నారు చిరు. ఇది తమిళ మూవీ 'వేదాళం' కి రీమేక్. ఇందులో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది.

ఇదే క్రమంలో డైరెక్టర్ బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో 'వాల్తేరు వీరయ్య' అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో చిరు నటిస్తున్నారు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. రవితేజ కీలక పాత్ర పోషించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ సినిమా రూపొందుతోంది.