Begin typing your search above and press return to search.

చిరు చెప్పిన ప్లాష్ బ్యాక్ వింటే షాక్ తినాల్సిందే

By:  Tupaki Desk   |   18 Nov 2019 4:05 AM GMT
చిరు చెప్పిన ప్లాష్ బ్యాక్ వింటే షాక్ తినాల్సిందే
X
ఏఎన్నార్ జాతీయ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం ఎన్నో విశేషాలకు.. మరెన్నో ఆసక్తకర అంశాలకు వేదికైందని చెప్పాలి. అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ప్రతిష్ఠాత్మకంగా అందజేసిన ఈ అవార్డులను 2019గాను ప్రముఖ నటి రేఖకు అందించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి చెప్పిన సంగతులు ఆసక్తికరంగానే కాదు ఆశ్చర్యాన్ని నింపాయి. గతంలో ఎప్పుడూ చెప్పని ఒక ఉదంతాన్ని చెప్పి అందరికి షాకిచ్చారు చిరు. దాదాపు ఆరు దశాబ్దాల క్రితం జరిగిన ఒక వాస్తవాన్ని తాను ఒక కథగా చెబుతానని చెప్పారు.

అదో పల్లెటూరు. అక్కడో జంట. నెలలు నిండిన గర్భవతి. రేపో..మాపో డెలివరీకి సిద్ధం. అలాంటివేళ.. తన అభిమాన నటుడి సినిమా రిలీజ్ అయ్యింది. ఆ సినిమా చూడాలన్నది ఆమె కోరిక. తన మనసులోని మాటను భర్తకు చెప్పింది. రోజులు నిండాయి.. ఇప్పుడు సినిమానా? అని అన్నారు.

డెలివరీ అయ్యాక కొన్ని నెలల పాటు సినిమాకు వెళ్లే అవకాశం లేదు. అందుకే ఇప్పుడు చూడాలను కుంటున్నా అని మనసులోని మాట చెప్పింది. ఆమె ఇష్టాన్ని కాదనలేని ఆ భర్త.. పల్లెటూరు నుంచి పట్నానికి వెళ్లేందుకు జట్కా బండిని సిద్ధం చేయించాడు. గతుకుల రోడ్డు మీద సినిమాకు వెళ్లటం కష్టం కదా? అంటే.. ఫర్లేదని ఉత్సాహంగా బదులిచ్చిందామె.

అలా వెళుతున్న వారి బండికి ప్రమాదం జరిగి.. రోడ్డు పక్కకు జట్కా బండి పడింది. ఆమెకు చిన్న గాయాలయ్యాయి. ఇంత జరిగిన తర్వాత సినిమానా? అంటూ భర్త అంటే.. ఫర్లేదులే అంటూ తన అభిమాన నటుడి సినిమా చూసేందుకు ఉత్సాహం చూపింది. ఆ సినిమాకు వెళ్లి వచ్చారు. ఆ తర్వాత వెంటనే ఆమె డెలివరీ అయ్యింది.

ఈ కథలో గర్భిణి ఎవరో కాదని.. తన తల్లి అంజనాదేవి అని.. భర్త తన తండ్రి వెంకట్రావు అని.. వారు వెళ్లింది 1955లొ రోజులు మారాయి అన్న సినిమా అని.. ఆ సినిమా హీరో ఏఎన్నార్ అని.. తన తల్లికి నాగేశ్వరరావు అంటే అంత అభిమానమని చిరు చెప్పారు. అన్ని చెప్పి.. ఆ రోజున తన తల్లి కడుపులో ఉన్నది ఎవరో కాదు.. తానేనని చెప్పారు.

ఇలా తాను సినిమాల మీద ఇష్టం పెంచుకోవటానికి తన తల్లి అభిరుచే కారణమన్న విషయాన్ని చెప్పి.. చదువు అయిన వెంటనే మద్రాస్ వెళ్లాలని నిర్ణయించుకోవటంలో తన తల్లికి సినిమా మీద ఉన్న ఇష్టమే కారణమని చెప్పారు.