ఐఏఎస్ ఆఫీసర్ గా మెగా హీరో...?

Sun Jul 12 2020 18:40:00 GMT+0530 (IST)

Mega hero as an IAS officer ...?

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సాయి ధరమ్ తేజ్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడానికి కష్టపడుతున్నాడు. ఈ క్రమంలో వరుస సినిమాలను లైన్లో పెడుతూ దూకుడు చూపిస్తున్నాడు. ఇప్పటికే 'ప్రస్థానం' దేవకట్టా దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ ఓ సినిమా స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ చేతులు మీదుగా లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రాన్ని జె.బి.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై జె.భగవాన్ - జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో తేజ్ క్యారెక్టర్ చాలా భిన్నంగా ఉంటుందని.. ఇప్పటి వరకు ఆయన కెరీర్లో ట్రై చేయని జోనర్ అని తెలుస్తోంది. నటుడిగా ఇది మెగా మేనల్లుడి మరో స్థాయికి తీసుకుపోయే సినిమా అవుతుందని ఇప్పటికే డైరెక్టర్ దేవాకట్టా వెల్లడించారు.కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ యువ ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించనున్నారట. అంతేకాకుండా ఈ స్టోరీ నేపథ్యం ఉత్తర భారతదేశంలో సాగుతుందని తెలుస్తోంది. ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించడం కోసం తేజ్ ఇప్పటికే తన బాడీని దానికి తగ్గట్టు మైంటైన్ చేస్తూ లుక్ విషయంలో కేర్ తీసుకుంటున్నారట. అంతేకాకుండా ప్రస్తుతం షూటింగ్స్ లేకపోవడంతో ఇంటికే పరిమితమైన తేజ్ పలువురు ఐఏఎస్ ఆఫీసర్స్ మరియు బ్యూరోక్రాట్స్ వీడియోలు చూస్తూ వారి బాడీ లాంగ్వేజ్ లను అబ్జర్వ్ చేస్తున్నాడట. ఇప్పటి వరకు తన కెరీర్లో పోషించని పాత్ర కావడంతో మెగా హీరో దీనిపై ప్రత్యేక ద్రుష్టి పెట్టాడని అర్థం అవుతోంది. ఇక దేవకట్టా సినిమాలో స్టోరీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుందనే విషయం అందరికి తెలిసిందే. ఈ క్రమంలో మెగా హీరో కోసం పవర్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసాడని సమాచారం. మరి ఈ సినిమా తేజ్ కి ఏ స్థాయి విజయాన్ని అందించనుందో చూడాలి.

ఇదిలా ఉండగా సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం సుబ్బు దర్శకత్వంలో 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా చేస్తున్నాడు. నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేయాలని భావించారు. కానీ దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల వల్ల వాయిదా పడింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ మరియు 'నో పెళ్లి' సాంగ్ సినిమాపై అంచనాలు పెంచేసింది. 'చిత్రలహరి' 'ప్రతీరోజూ పండగే' వంటి రెండు వరుస విజయాలు సొంతం చేసుకున్న సాయి ధరమ్ తేజ్ తన సక్సెస్ ట్రాక్ కొనసాగిస్తాడేమో చూడాలి.