అదో బబూల్ గమ్ లాంటి సినిమా!

Mon Jun 27 2022 16:00:01 GMT+0530 (India Standard Time)

Maruti movie news

మారుతి కెరియర్ ను పరిశీలిస్తే .. మొదటి నుంచి కూడా ఆయన మంచి ప్లానింగుతో ముందుకు వెళ్లడం కనిపిస్తుంది. ముందుగా ఆయన చిన్న బడ్జెట్ .. చిన్న హీరోలతో సినిమాలను ప్లాన్ చేసుకున్నాడు. సినిమాలను ఎక్కువగా చూసేది యూత్ కనుక వాళ్లకి కనెక్ట్ అయ్యే కథలను తయారు చేసుకున్నాడు. యూత్  థియేటర్లకు రావాలంటే వాళ్లు ఆశించే అంశాలు ఉండాలనే ఉద్దేశంతో కాస్త మోతాదు పెంచాడు. సినిమా హిట్ కాకపోయినా నిర్మాతలు నష్టపోని స్థాయిలోనే ఆయన సినిమాలు ఉండేవి.సినిమాలు సరిగ్గా ఆడాలంటే యూత్ మాత్రమే కాదు .. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్లకు రావాలనే విషయం ఆయనకి అర్థమైంది.  సినిమా ఎలా ఉందనేది ప్రేక్షకులు థియేటర్స్ కి వచ్చిన తరువాత తెలిసే సంగతి .. థియేటర్స్ కి రప్పించేది మాత్రం హీరోల స్టార్ డమ్ అనేది బోధపడింది.

కొంతమంది ఎంజాయ్ చేసే డబుల్ మీనింగ్ డైలాగులకన్నా .. అందరూ ఎంజాయ్ చేసే కామెడీ బెటర్ అనుకుని మారుతి తన దిశను మార్చుకున్నాడు. అప్పటి నుంచి ఆయన స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ ముందుకు వెళుతున్నాడు.

మారుతి 'పక్కా కమర్షియల్' సినిమా చేస్తున్న సమయంలోనే లాక్ డౌన్ పడింది. దాంతో ఈ సినిమా షూటింగు ఆగిపోయింది. కానీ తనతో  పాటు మరి కొంతమందికి పని కావాలనే ఉద్దేశంతో ఆయన  ఒక సింపుల్ లైన్ అనుకుని అందుబాటులో ఉన్న లొకేషన్స్  లో .. అందుబాటులో ఉన్న ఆర్టిస్టులతో కానిచ్చేశారు. అది హిట్ అనుకోలేం .. ఫ్లాప్ అని చెప్పలేం. ఎందుకంటే ఆ సమయం .. పరిస్థితులు అలాంటివి. ఇదే ప్రస్తావన మారుతి దగ్గర తీసుకుని వస్తే 'అదో బబూల్ గమ్' వంటి సినిమా అనేశాడు.

పెద్ద సూపర్ మార్కెట్లో చిన్న బబూల్ గమ్ కూడా అమ్ముతుంటారు .. నా నుంచి వచ్చిన సినిమాలలో ఇది కూడా అలాంటిదే. 'మంచిరోజులొచ్చాయి' సినిమా 3 కోట్ల ఖర్చుతో జనం ముందుకు వెళ్లింది .. 12 కోట్లను వసూలు చేసింది. ఇప్పుడు చెప్పండి .. ఇది హిట్టా? .. ఫ్లాపా? అని అడిగేశాడాయన.

నా వరకూ అప్పుడున్న పరిస్థితులకు తగినట్టుగా కథను అల్లుకున్నాను .. సమయానికి తగినట్టుగా తెరకెక్కించాను. అసలు ఎవరికీ ఏ పనీ లేని ఆ సమయంలో ఆ సినిమా వలన 200 మందికి పని దొరికింది. అక్కడ నేను సక్సెస్  అయ్యానని చెప్పగలను" అన్నాడు. ఇప్పుడు మారుతి ఖాతాలోకి ఇటు చిరంజీవి .. అటు ప్రభాస్ ప్రాజెక్టులు చేరడంతో ఆయనకి మంచిరోజులొచ్చాయియని చెప్పు కుంటున్నారు.