ట్రైలర్ టాక్: సైకో కిల్లర్ పై రాణీజీ ఆపరేషన్

Thu Nov 14 2019 17:25:02 GMT+0530 (IST)

Mardaani 2 Movie Trailer

రేప్ లు.. అత్యాచారాలు.. హత్యలు .. ఇదీ `మర్ధానీ`(2014) స్టోరి లైన్. క్రైమ్ జోనర్ లో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ అప్పట్లో సంచలనం. ముఖ్యంగా గ్రేట్ పెర్ఫామర్ రాణీ ముఖర్జీ కంబ్యాక్ సినిమాగా ప్రముఖంగా చర్చల్లోకొచ్చింది. ఇందులో శివానీ.. శివాజీ రాయ్ అంటూ రాణీజీ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా అద్భుతమైన నటనతో మైమరిపించారు. టీనేజీ గాళ్స్ ని కిడ్నాప్ చేసి హత్యలు చేసే సీరియస్ క్రైమ్ డ్రామాలో లేడీ పోలీస్ ట్రీట్ మెంట్ జనాలకు ఫుల్ గా కనెక్టయ్యింది. అందుకే ఈ ఫ్రాంఛై జీలో సీక్వెల్ తెరకెక్కుతోంది అనగానే అందరిలో ఆసక్తి నెలకొంది.అర్థరాత్రి ఆడది రోడ్ల పై తిరిగిన నాడే భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినట్టు! అని నాటి స్వాతంత్య్ర కర్తలు.. మహామహులు నినదించారు. అయితే ఆ సన్నివేశం భారతదేశంలో ఉందా? అంటే అసలు నేటి సమాజంలో అరాచకాలు చూస్తుంటే అది ఎప్పటికీ సాధ్యం కాదని అర్థమవుతోంది. రోడ్లపై వెళుతున్న మహిళలకు రక్షణ లేదు. మృగాళ్లు ఓవైపు .. సైకో కిల్లర్లు ఇంకోవైపు భయపెట్టేస్తున్న పరిస్థితి ఉంది. అందుకే మర్ధానీ 2 ట్రైలర్ ఎత్తుగడనే అమ్మాయిని సైకో కిల్లర్ కిడ్నాప్ చేయడంతో ప్రారంభించారు. పార్ట్ 1 కథతో కనెక్టివిటీని ఇవ్వడం ఆసక్తికరం. వరుసగా రేప్ లు.. హత్యలు చేస్తూ నగరంలో కలకలం రేపిన సైకో కిల్లర్ ని వేటాడుతూ రాణీ ముఖర్జీ మరోసారి మాస్ పవర్ ఫుల్ కాప్ గా కనిపిస్తున్నారు.

ఇలాంటి క్రైమ్ జోనర్ సినిమాలో ఎమోషన్లకు పెద్ద స్థాయిలోనే ఆస్కారం ఉంటుందని గతంలో వచ్చిన సినిమాలెన్నో నిరూపించాయి. ఇటీవలే తమిళంలో రిలీజైన రచ్ఛాసన్.. తెలుగు రీమేక్ వెర్షన్ రాక్షసుడు సైతం ఈ జోనర్ లో వచ్చినవే. ఇక మర్ధానీ 2కి లేడీ పోలీసాఫీసర్ గా నటిస్తున్న రాణీ ముఖర్జీ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఖాకీ డ్రెస్ లో రాణీజీ ఫైరింగ్ అదిరిపోయింది. ఇంతకుముందు చూసేసిన రొటీన్ స్టోరీ లైన్ అయినా.. ట్రైలర్ లో చూపించినంత గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సినిమా ఆద్యంతం కట్టి పడేస్తే విజయం సాధ్యమే. మర్ధానీ 2 ఏ స్థాయి విజయం సాధిస్తుంది అన్నది చూడాలి. గోపి పుత్రన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తోంది. డిసెంబర్ 13న ఈ చిత్రం థియేటర్లలోకి వస్తోంది.