'ఆ సినిమా చేయకూడదనుకున్నా.. పిచ్చా అని తిడితే చేశా'

Fri Mar 31 2023 09:52:56 GMT+0530 (India Standard Time)

Manisha Koirala In Recent Interview

అద్భుతమైన అవకాశాల్ని వచ్చినప్పుడు.. అర్థం లేని లెక్కలు వేసుకొని నో చెప్పేయటం చాలామంది నటీనటులు దెబ్బ తినటం చూస్తుంటాం. అయితే.. అలాంటి ప్రమాదాన్ని త్రుటిలో తప్పించుకున్న వైనం గురించి సీనియర్ నటి.. తన అందచందాలతో కోట్లాది మంది కుర్రకారుకునిద్రలు లేకుండా చేసిన అందం మనీషా కొయిరాలా సొంతం. సినిమాల్లో ఆమె ఎంట్రీ ఎలా ఉన్నా.. ఆమె సినిమాలు చేసే వేళలో.. ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.ఆమె కెరీర్ లో అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా నిలిచే చిత్రం బాంబే. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చారు. బాంబే మూవీకి మణిరత్నం నుంచి ఆఫర్ వచ్చినప్పుడు తాను ఈ సినిమా చేయకూడదని అనుకున్నట్లు చెప్పారు. ఇద్దరు పిల్లల తల్లిగా సినిమా చేస్తే.. కెరీర్ ముగిసినట్లే అవుతందని..అందుకే వద్దని చెబుదామనుకున్నట్లు వెల్లడించారు.

అయితే.. సినిమాటోగ్రాఫర్ అశోక్ మెహతా మాత్రం నా నిర్ణయాన్ని తీవ్రంగా తప్పు పట్టటమే కాదు.. అసలు మణిరత్నం గురించి నీకేం తెలుసు? అని ప్రశ్నించారు. ఆయన సినిమాలో ఛాన్సు వద్దనుకున్నావంటే.. నీ అంత పిచ్చోళ్లు ఇంకొకరు ఉండరని తిట్టారు. దీంతో.. నా నిర్ణయాన్ని మార్చుకున్నా. బాంబే మూవీ చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నట్లుగా పేర్కొన్నారు. 1995లో వచ్చిన ఈ కల్ట్ క్లాసిక్ ఘన విజయాన్ని సొంతం చేసుకోవటమేకాదు.. మనీషా కొయిరాలా కెరీర్ గ్రాఫ్ ను మరో స్థాయికి తీసుకెళ్లింది.

కొంతకాలం తర్వాత తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ స్వయంగా కథ అందించి.. నిర్మించిన బాబా చిత్రంలో ఆయన సరసన నటించారు. అయితే.. ఈ మూవీ దారుణంగా ఫెయిల్  కావటం.. ఆ సినిమా తర్వాత తనకు అవకాశాలు ఇవ్వటమే మానేసినట్లుగా చెప్పారు. తాను అనుకున్నదే నిజమైందని.. సినిమా తర్వాత తనకు అవకాశాలు రాకుండా పోయినట్లు పేర్కొన్నారు. బాబా ఫెయిల్ తో తనకు సౌత్ నుంచి ఆఫర్లు రావటం ఆగినట్లుగా మనీషా తెలిపారు. అయితే.. ఈసినిమా ఇటీవల రీరిలీజ్ కావటం.. పెద్ద ఎత్తున కలెక్షన్లు రావటం విస్మయానికి గురి చేసింది.