మా బిల్డింగ్ ఇక లేనట్టేనా?

Thu Aug 18 2022 07:00:01 GMT+0530 (India Standard Time)

Manchu Vishnu assumed the responsibilities of Maa president

సీనియర్ నటులు మురళీమోహన్ మా అధ్యక్ష పీఠం నుంచి తప్పుకున్న దగ్గరి నుంచి 'మా'లో ఏదో ఒక ముసలం మొదలవుతూనే వుంది. మెగాస్టార్ చిరంజీవి తొలి అధ్యక్షుడిగా మొదలైన 'మా' అసోసియేషన్ కు గత రెండేళ్లకు ఒకసారి కార్యవర్గ ఎన్నికలు జరుగుతూ వస్తున్నాయి. ప్రతీ ఎలక్షన్ లోనూ 'మా' బిల్టంగ్ ప్రధాన అజెండాగా మారుతూ వస్తోంది. ప్రతీ రెండేళ్లకు ఒకసారి జరిగే 'మా' ఎన్నికలు సాధారణ ఎన్నికలని తలపిస్తూ హాట్ టాపిక్ గాద మారుతూనే వున్నాయి.



అధికార పార్టీలు కూడా కొన్ని సందర్భాల్లో జోక్యం చేసుకుని అధ్యక్ష పదవిని డిసైడ్ చేశాయంటే 'మా' ఎన్నికలకు ఎంతటి ప్రాధాన్యతని ఆపాదించారో అర్థం చేసుకోవచ్చు. రాజేంద్ర ప్రసాద్ - జయసుధ శివాజీ రాజా - నరేష్ లు అధ్యక్ష పదవి కోసం పోటీ పడిన సందర్భంలో సార్వత్రిక ఎన్నికల్లో పోటీపడిన రాజకీయ నేతల తరహాలో ఒకరిపై ఒకరు బురద జల్లుకుని నానా రచ్చ చేశారు. రాజేంద్ర ప్రసాద్ ని జయసుధ జోకర్ అంటూ సంబోధించడం అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది.

ఇక నరేష్ - శివాజీ రాజా టర్మ్ లోనూ ఇదే తరహాలో రచ్చ నడిచింది. రెండేళ్ల పదవీ కాలానికి ఎందుకింత రచ్చ అంటూ సగటు ప్రేక్షకులు కూడా 'మా' ఎన్నికల వీరంగం చూడలేక కామెంట్ లు చేశారు. ఇక గత ఏడాది జరిగిన మా ఎన్నికలు ఎంత రసభాసగా మారాయో అందరికి తెలిసిందే. ప్రకాష్ రాజ్ ప్యానెల్ వర్సెస్ మంచు విష్ణు ప్యానెల్ లు పోటీపడగా లోకల్ నాన్ లోకల్ నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. దీంతో మంచి విష్ణు వర్గం విజయం సాధించింది.

మా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన మంచు విష్ణు ఇంత వరకు తన ఎన్నికల వాగ్ధానం అయిన మా బిల్డింగ్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడక పోవడం గమనార్హం. ఇటీవల జయసుధ మీడియా ముఖంగానే మంచు విష్ణు పై సంచలన కామెంట్ చేసింది. పదవి స్వీకరించి నెలలు గడుస్తున్న మా బిల్డింగ్ ఊసే ఎత్తడం లేదని పరోక్షండా చురకలు అంటించింది. దీనిపై మంచి విష్ణు స్పందిస్తాడేమో అని అంతా ఆసక్తిగా చూశారు.

కానీ అది జరగలేదు. మా ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాలని మాత్రం ఒక్కొక్కటిగా జరిపిస్తున్నాడు మంచు విష్ణు. ఇటీవల మొదటి సమావేశాన్ని పూర్తి చేసి ఏం నిర్ణయించారో వెల్లడించని మంచు విష్ణు తాజగా మరో సమావేశం ముగిసిందని సోషల్ మీడియా వేదికగా ఓ ఫొటోని పంచుకుని దానికి ఆసక్తికరమైన వ్యాఖ్యలు జోడించాడు. ఇంత అంకిత భావంతో పనిచేసే టీమ్ తో పని చేస్తున్నందుకు గౌరవంగా భావిస్తున్నాను.

మేము తీసుకు వచ్చిన సంస్కరణలు అసాధారణమైవి వేగవంతమైన మెరుగైన వృద్ధికి మార్గం సుగమం చేస్తాయి' అని ట్వీట్ చేశాడు. కానీ మా బిల్డింగ్ గురించి మాత్రం ఒక్క మాట కూడా చెప్పకపోవడంతో మా బిల్డింగ్ లేనట్టేనా? అనే సెటైర్లు పడుతున్నాయి.