Begin typing your search above and press return to search.

దిశ నిందితుల ఎన్‌ కౌంట‌ర్ సెల‌బ్రేష‌న్ వ‌ద్దు.. మంచు ల‌క్ష్మి!

By:  Tupaki Desk   |   6 Dec 2019 4:47 PM GMT
దిశ నిందితుల ఎన్‌ కౌంట‌ర్ సెల‌బ్రేష‌న్ వ‌ద్దు.. మంచు ల‌క్ష్మి!
X
వెట‌ర్న‌రీ డాక్ట‌ర్ దిశ నిందితులను ఎన్‌ కౌంట‌ర్ చేయ‌డంతో ప్ర‌తి ఒక్క‌రు స్పందిస్తున్నారు. తెలంగాణ పోలీసుల‌తో పాటు సైబ‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్‌ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. టాలీవుడ్ సినిమా ప్ర‌ముఖుల నుంచి బాలీవుడ్ వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రు త‌మ అభిప్రాయాలు సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్ర‌ముఖ న‌టి మంచు ల‌క్ష్మి సైతం ఓ వీడియో ద్వారా ఈ ఎన్‌ కౌంట‌ర్‌ పై త‌న స్పంద‌న తెలిజేశారు.

దిశ నిందితుల ఎన్‌ కౌంట‌ర్‌ పై దేశ‌వ్యాప్తంగా ఎంతోమంది స్వీట్లు పంచుకుని.. రోడ్ల‌పైకి వ‌చ్చి డ్యాన్సులు చేస్తున్నార‌ని.. రాఖీలు క‌ట్టుకుంటున్నార‌ని అయితే ఈ త‌రుణంలో ఇలాంటి సెల‌బ్రేష‌న్స్ అనేవి స‌రైన‌వి కావ‌ని ఆమె త‌న అభిప్రాయం వ్య‌క్తం చేశారు. త‌ప్పుచేసిన వాళ్ల‌కు స‌రైన శిక్ష ప‌డింద‌న్న అభిప్రాయం ప్ర‌తి ఒక్క‌రికి ఉన్నా... ఇలాంటి సంఘ‌ట‌నలు భ‌విష్య‌త్తులో పున‌రావృతం కాకుండా ఏం ? చేయాల‌న్న దానిపై అంద‌రూ ఆలోచించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆమె తెలిపారు. ఇక‌పై ఎవ‌రైనా త‌ప్పు చేస్తే మ‌నం దీనిని స్ఫూర్తిగా తీసుకుని వారిని చంపేయాల‌న్న ఆలోచ‌న చేసే ఛాన్స్ ఉంద‌ని.. ప్ర‌తి ఒక్క‌రు ఈ త‌ర‌హా ఆలోచ‌న చేయ‌వ‌ద్ద‌ని ఆమె చెప్పారు.

భ‌విష్య‌త్తులో కూడా ఈ త‌ర‌హా త‌ప్పులు చేసే వాళ్లంద‌రిని ఎన్‌ కౌంట‌ర్ చేయ‌లేర‌ని చెప్పిన ఆమె నిర్భ‌య కేసులో రాడ్ వాడిన వ్య‌క్తి భ‌య‌ట స్వేచ్ఛ‌గా తిరుగుతున్నాడ‌ని... ఇదెక్క‌డి న్యాయం ? అని ప్ర‌శ్నించారు. ఈ కేసులో నిందితులను ప్ర‌త్యేక గ‌దిలో పెట్టి పోలీసులు మూడు పూట‌లా షిఫ్టుల్లో కాప‌లా కాస్తున్నార‌ని.. ఏడేళ్ల‌వుతున్నా వాళ్ల‌కు ఇంకా శిక్ష ప‌డ‌క‌పోవ‌డం దారుణ‌మ‌ని ల‌క్ష్మి చెప్పారు. ప్ర‌తి కేసులోనూ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి.. ఇలా ఎన్‌ కౌంట‌ర్లు చేసి నిందితుల‌కు వెంట‌నే శిక్ష వేయ‌డం జ‌రిగే ప‌ని కాద‌ని ఆమె చెప్పారు. వాస్త‌వంగా ఇలాంటి నిందితుల‌ను త‌న‌తో పాటు త‌న తండ్రి మాత్రం ఎన్‌ కౌంట‌ర్ చేయాల‌నే కోరుకుంటామ‌ని కూడా చెప్పారు.

ఇక త‌న కుమార్తె స్కూల్‌ కు వెళుతుంటే తాను న‌లుగురు వ్య‌క్తుల‌ను తోడుగా ఇచ్చి పంపిస్తాన‌ని... ఆ స్థోమ‌త త‌న‌కు ఉంద‌ని.. అయితే అంద‌రు త‌ల్లిదండ్రుల విష‌యంలో ఇది సాధ్యం కాద‌న్నారు. ఇక త‌న తండ్రి తాను స్కూల్‌ కు వెళ్లిన‌ప్పుడు ఏ టైంకు ఇంటికి రావాలి ? ఎవ‌రెవ‌రితో మాట్లాడ‌కూడ‌దు లాంటి ఎన్నో జాగ్ర‌త్త‌లు చెప్పేవార‌ని... దిశ త‌ల్లిదండ్రులు కూడా ఈ విష‌యంలో ఎంతో జాగ్ర‌త్త‌లు తీసుకున్నా.. ఆమె ఏ త‌ప్పు చేయ‌క‌పోయినా అనుకోకుండా ఆమె జీవితం బ‌లైపోయింద‌ని ల‌క్ష్మి ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ప్ర‌తి రోజు పేప‌ర్ చూస్తుంటే 60 ఏళ్ల ముస‌లావిడ‌ - 5 ఏళ్ల పసిపాపల‌ పై సైతం ఈ త‌ర‌హా దాడులు జ‌రుగుతున్నాయ‌న్న వార్త‌లు చూస్తుంటే ప్రాణం త‌రుక్కుపోతోంద‌న్నారు. దిశ కేసులో నిందితుల‌కు శిక్ష ప‌డింద‌న్న తృప్తి ఆమె త‌ల్లిదండ్రుల‌కు ఉన్నా.. వాళ్ల కూతురిని ఎప్ప‌ట‌కీ తీసుకు రాలేం ? క‌దా ? అని ప్ర‌శ్నించారు. ఇక తెలంగాణ పోలీసులు అంటే త‌న‌కు చాలా ఇష్టం... అని స్వాతిల‌క్రా లాంటి డేరింగ్ మ‌హిళా ఆఫీస‌ర్లు ఇక్క‌డ ఉండ‌డం మ‌న అదృష్ట‌మ‌ని ఆమె చెప్పారు. ఇక ఈ త‌ర‌హా దాడుల‌పై పోరాటాలు చేసేందుకు ఇండ‌స్ట్రీ నుంచి తామంద‌రం సిద్ధంగా ఉన్నామ‌ని.. అయితే ఎవ‌రైనా పోరాటాలు చేసినంత మాత్రాన స‌రిపోద‌ని.. ప్ర‌తి ఒక్క‌రిలోనూ ఈ మార్పు ఉండాల‌ని ఆమె ఆకాంక్షించారు.