బన్నీ ని ఢీ కొట్టడానికి రెడీ అవుతున్న ఫాఫా..!

Thu Jul 22 2021 09:00:01 GMT+0530 (IST)

Malik Star To Lock Horns With Pushparaj In August

మలయాళ నేచురల్ స్టార్ ఫహద్ ఫాజిల్ 'ట్రాన్స్' 'అనుకోని అతిథి' వంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయయ్యాడు. ఈ క్రమంలో ''పుష్ప'' చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తోన్న ఈ యాక్షన్ డ్రామాలో మెయిన్ విలన్ గా కనిపించనున్నారు ఫహద్. మాలీవుడ్ లో హీరోగా సినిమాలు చేస్తున్న ఫాజిల్.. తెలుగులో ప్రతినాయకుడిగా నటించడానికి రెడీ అవడంతో అందరి దృష్టి అతని పాత్రపై పడింది.ఫహాద్ సైతం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. డైరెక్టర్ సుకుమార్ చెప్పిన స్ర్కిప్టు చాలా బాగా నచ్చిందని.. ఈ భారీ యాక్షన్ చిత్రంలో భాగస్వామిని అయినందుకు ఆనందంగా ఉందని తెలిపారు. ఇందులో తన పాత్ర వైవిధ్యంగా ఉండబోతుందని.. తన కెరీర్ లోనే ఇప్పటి వరకు ఇలాంటి పాత్ర పోషించలేదని మలయాళీ నటుడు వెల్లడించారు. అల్లు అర్జున్ - సుకుమార్ వంటి వారితో కలిసి వర్క్ చేస్తున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు.

'పుష్ప' సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభించని ఫహాద్.. ఆగస్టులో టీమ్ తో జాయిన్ అవనున్నట్లు వెల్లడించాడు. ఇప్పటికే చిత్రీకరణలో విలన్ పాత్రధారి పాల్గొనాల్సి ఉండగా.. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా షూట్ కు బ్రేక్ పడినట్లు టాక్ వినిపిస్తోంది. అందుకే ఆగస్ట్ లో తిరిగి షూటింగ్ చేయనుండగా.. అప్పుడే ఫహాద్ కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలుస్తోంది. ఇకపోతే ఫహద్ ఇందులో నెగిటివ్ షేడ్స్ ఉండే పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారని.. అల్లు అర్జున్ చేస్తున్న పుష్ప రాజ్ పాత్రను అరెస్టు చేసి ఇబ్బందులకు గురి చేస్తుందని ఓ రూమర్ చక్కర్లు కొడుతోంది.

కాగా శేషాచలం అడవుల్లో ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో 'పుష్ప' సినిమా తెరకెక్కుతోంది. ఇందులో బన్నీ లారీ డ్రైవర్ గా ఊర మాస్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ - టీజర్ లలో అల్లు అర్జున్ లుక్ అలరించింది. లక్కీ బ్యూటీ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ప్రకాష్ రాజ్ - జగపతిబాబు - సునీల్ - అనసూయ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. మిరోస్లా కుబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఆంటోనీ రూబెన్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. రసూల్ పూకుట్టి సౌండ్ డిజైనింగ్ చేస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని - వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 'పుష్ప' చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రెండు భాగాలుగా విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 'పుష్ప 1' కు సంబంధించిన మెజారిటీ షూటింగ్ పూర్తి అయింది. మొదటి భాగాన్ని తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో 2021 ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది.