Begin typing your search above and press return to search.

మహేష్ vs పవన్: సంక్రాంతి ఫైట్ తప్పలేదుగా..!

By:  Tupaki Desk   |   27 July 2021 1:30 PM GMT
మహేష్ vs పవన్: సంక్రాంతి ఫైట్ తప్పలేదుగా..!
X
టాలీవుడ్ లో సంక్రాంతి సీజ‌న్ లో పెద్ద హీరోల సినిమాలు పోటీ పడుతుంటాయనే విషయం తెలిసిందే. 2021 సంక్రాంతి ఫైట్ లో స్టార్ హీరోల సినిమాలు లేనప్పటికీ.. వచ్చే ఏడాది సంక్రాంతి మాత్రం చాలా ర‌స‌వ‌త్తంగా మార‌నుందని అర్థం అయిపోయింది. ఫ్యాన్ ఫాలోయింగ్ లో పోటాపోటీగా నిలిచే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - సూపర్ స్టార్ మహేష్ బాబు ఇద్దరూ సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో దిగుతున్నట్లు ప్రకటించారు.

మహేష్ బాబు - డైరెక్టర్ పరశురామ్ పెట్లా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'సర్కారు వారి పాట'. జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ - మైత్రీ మూవీ మేకర్స్ - 14 రీల్స్ ప్లస్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని 2022 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ఇది వరకే ప్రకటించారు. ఇదే క్రమంలో పవన్ - క్రిష్ జాగర్లమూడి కాంబోలో రూపొందుతున్న హిస్టారికల్ మూవీ 'హరి హర వీరమల్లు' కూడా పెద్ద పండుగ సీజన్ లో తీసుకొస్తున్నట్లు అనౌన్స్ చేశారు.

అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ ప్లాన్స్ అన్నీ మారడంతో మహేష్ - పవన్ ల మధ్య పోటీ లేకపోవచ్చని అందరూ అనుకున్నారు. పవన్ కూడా క్రిష్ సినిమాని పక్కన పెట్టి 'అయ్యప్పనుమ్ కొశీయుమ్' స్టార్ట్ చేయడంతో సంక్రాంతికి వీరమల్లు రాకపోవచ్చని అర్థం అయింది. ఈ నేపథ్యంలో తాజాగా '#PSPKRana' చిత్రాన్ని సంక్రాంతి బరిలో నిలుపుతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో పవన్ - మహేష్ ల మధ్య పోటీ అనివార్యం అయింది.

పవన్ కళ్యాణ్ - దగ్గుబాటి రానా కలిసి నటిస్తున్న 'ఏకే' రీమేక్ కు సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందించడంతో పాటుగా దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా మేకింగ్ వీడియో రిలీజ్ చేసిన మేకర్స్.. పనిలో పనిగా ఎప్పుడు విడుదల కాబోతుందో చెప్పేసారు.

మహేష్ - పవన్ ఇప్పటి వరకు నాలుగు సార్లు బాక్సాఫీస్ వద్ద పోటీ పడినప్పటికీ ఒకేసారి ఫైట్ చేయలేదు. కొన్ని రోజుల గ్యాప్ లో ఇద్దరి సినిమాలు రిలీజ్ అయ్యేలా చూసుకున్నారు. 1999లో మహేష్ డెబ్యూ మూవీ 'రాజకుమారుడు' - పవన్ 'తమ్ముడు' సినిమాలు రెండు వారాల తేడాతో విడుదలయ్యాయి. 2000లో పవన్ 'బద్రి' - మహేష్ 'యువరాజు' సినిమాలు వారం గ్యాప్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. 2004లో మూడు వారాల గ్యాప్ లో మహేష్ 'అర్జున్' - పవన్ 'గుడుంబా శంకర్' చిత్రాలు రిలీజ్ అయ్యాయి. అలానే 2006లో మహేష్ బాబు 'పోకిరి' - పవన్ 'బంగారం' చిత్రాలు ఐదు రోజుల గ్యాప్ లో వచ్చాయి.

మళ్ళీ ఇప్పుడు 16 ఏళ్ల తర్వాత స్టార్ హీరోలిద్దరిని బాక్సాఫీస్ బరిలో చూడబోతున్నారు. కాకపోతే ఈసారి కూడా కొంచం గ్యాప్ లో వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఎప్పుడు వచ్చినా 'సర్కారు వారి పాట' '#PSPKRana' రెండు చిత్రాలు భారీ ఓపెనింగ్స్ రాబడతాయి. 2020లో ఒకేసారి వచ్చిన 'అల వైకుంఠపురములో' - 'సరిలేరు నీకెవ్వరు' చిత్రాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. మహేష్ తో పోటీ పడిన, పడుతున్న రెండు సినిమాలు కూడా ప్రస్తుతం '#SSMB28' సినిమా చేస్తున్న త్రివిక్రమ్ ఆధ్వర్యంలోనివే. మరి 2022 సంక్రాంతి వార్ లో పవన్ - మహేష్ లలో ఎవరు విన్నర్ గా నిలుస్తారో చూడాలి.