రావిపూడిని అలా టీజ్ చేసిన మహేష్!

Fri Jan 10 2020 12:36:42 GMT+0530 (IST)

Mahesh Babu Teases Anil Ravipudi In Sarileru Neekevvaru Seats

'సరిలేరు నీకెవ్వరు' తో తొలిసారిగా అనిల్ రావిపూడికి సూపర్ స్టార్ మహేష్ బాబును డైరెక్ట్ చేసే అవకాశం లభించింది. సినిమా ప్రోమోస్ చూస్తుంటే అనిల్ ఈ అవకాశం చక్కగా ఉపయోగించుకున్నాడనే అనిపిస్తోంది. చాలారోజుల తర్వాత మహేష్ ను మాస్ అవతారంలో చూపిస్తుండడంతో సినిమాపై ఇప్పటికే అంచనాలు పెరిగిపోయాయి. అనిల్ రావిపూడి కూడా ఈ సినిమా విజయం సాధించడం ఖాయమని అంటున్నారు.మహేష్ బాబుతో కలిసి పనిచేయడం మరిచి పోలేని అనుభవం అని చెప్పిన అనిల్ షూటింగ్ సమయంలో మహేష్ తో జరిగిన ఆసక్తికర సంఘటన గురించి వెల్లడించారు. అనిల్ కు కోపం వస్తే ఇతరులపై అరవడం.. కేకలు పెట్టడం లాంటివి చేయరట. దానికి బదులుగా కోపాన్ని కంట్రోల్ చేసుకునేందుకు ఏదో ఒకటి తింటారట. పాజిటివ్ గా ఉండాలనే ఉద్దేశంలో ఇలా చేస్తానని తెలిపారు. అయితే ఈ విషయం మహేష్ గారు గమనించారని.. అప్పటి నుంచి ఈ విషయంపై తనను సరదాగా ఏడిపిస్తూ ఉండేవారని అన్నారు. మహేష్ తో పని చెయ్యడం ఏ దర్శకుడికైనా సంతోషం ఇస్తుందని తనకు ఇలాంటి అవకాశం ఇచ్చిన మహేష్ కు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదిలా ఉంటే మహేష్ కూడా అనిల్ రావిపూడి వర్క్ పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈమధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భవిష్యత్తులో అనిల్ తో మరోసారి కలిసి పనిచేసే ఆలోచన ఉందని కూడా చెప్పుకొచ్చారు. మహేష్ ఈమధ్య చేసిన సినిమాలు గమనిస్తే దాదాపుగా దర్శకులను రిపీట్ చేస్తూ ఉంటారు. ఈలెక్కన మహేష్-అనిల్ కాంబో రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టే.