'సర్కారు వారి పాట' కూడా ఆ కోవకే చెందుతుందా..??

Fri May 13 2022 08:00:01 GMT+0530 (IST)

Mahesh Babu Sarkaru Vari Paata

సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి రెండున్నరేళ్ల గ్యాప్ తరువాత వచ్చిన సినిమా ''సర్కారు వారి పాట''. 'గీత గోవిందం' లాంటి సూపర్ హిట్ తర్వాత పరుశురామ్ పెట్లా తెరకెక్కించిన సినిమా కావడంతో ముందు నుంచీ అందరిలో మంచి అంచనాలున్నాయి. రిలీజ్ కు ముందు భారీ హైప్ తీసుకొచ్చిన ఈ సినిమా.. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే సర్కారు వారు అంచనాలు ఏమాత్రం అందుకోలేకపోయారని సినిమాకు మొదటి రోజు వచ్చిన మిశ్రమ స్పందన చూస్తే అర్థం అవుతుంది. ప్రస్తుత బ్యాంకింగ్ వ్యవస్థ మీద మంచి పాయింట్ రాసుకున్న దర్శకుడు పరశురాం.. దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో ఫెయిల్ అయ్యారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

మహేష్ బాబును కొత్తగా ప్రెజెంట్ చేయడంలో సక్సెస్ అయిన దర్శకుడు.. ఆయన స్టార్ డమ్ కు సరిపడా సీన్లు అల్లుకోలేకపోయారని అంటున్నారు. సూపర్ స్టార్ ఫ్యాన్స్ ను అలరించినా.. ఎన్ని హంగులు జోడించినా.. ప్రేక్షకులకు ఎమోషనల్ గా కనెక్ట్ కాకపోవడంతో ‘సర్కారు వారి పాట’ ఒక సాధారణ కమర్షియల్ చిత్రంగా మిగిలిందని చెబుతున్నారు.

మరీ ముఖ్యంగా సినిమాలో హీరో పాత్రకు మెయిన్ పాయింట్ కు సరిగా ముడి పెట్టలేకపోవడమే డ్రా బ్యాక్ అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. తనది కాని ప్రతీకారాన్ని హీరో నెత్తికెత్తుకున్న సినిమాలేవీ ఆడియన్స్ కు కనెక్ట్ అయిన దాఖలాలు లేవు.. అలాంటి సినిమాలు ఆడిన దాఖలాలు కనిపించవు.

ఇందుకు ఎన్టీఆర్ నటించిన 'ఊసరవెల్లి'.. గోపీచంద్ 'వాంటెడ్' లాంటి సినిమాలు ఉదాహరణలుగా కనిపిస్తాయి. ఇప్పుడు 'సర్కారు వారి పాట' చిత్రం కూడా ఇదే కోవలోకి వస్తుందని అభిప్రాయ పడుతున్నారు. హీరోకు నేరుగా సంబంధం లేని వ్యవహారంలో.. తనది కాని ఓ లక్ష్యాన్ని నెత్తికెత్తుకుని.. విలన్ ను ఢీకొడుతుంటే ఎమోషనల్ గా ఎలా కనెక్ట్ అవుతుందని అంటున్నారు.

మొత్తం మీద మహేశ్ బాబుతో సినిమా అనేది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెబుతూ వచ్చిన డైరెక్టర్ పరశురాం.. సూపర్ స్టార్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారనేది అర్థం అవుతోంది. మహేష్ స్టార్ డమ్ వల్ల 'సర్కారు వారి పాట' ఓపెనింగ్స్ కు డోకా లేదు. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.