సూపర్ స్టార్ వైవాహిక జీవితంలో సీక్రెట్స్

Wed Oct 09 2019 12:23:45 GMT+0530 (IST)

Mahesh Babu Reveals Secret Behind His Happy Married Life With Namrata

సూపర్ స్టార్ మహేష్ - నమ్రతా శిరోద్కర్ జంట లవ్ స్టోరీ గురించి తెలిసిందే. వంశీ సినిమా సమయంలో ఈ ఇద్దరూ ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఆ తర్వాత లవ్ స్టోరి.. పెళ్లి గురించి తెలిసిందే. ఆ ఇద్దరిది ఓ అందమైన ప్రేమ కథకు ఏమాత్రం తక్కువ కాదు. ప్రస్తుతం ఈ జంట టాలీవుడ్ లోనే ఆదర్శ దంపతులుగా వెలిగిపోతున్నారు. ఈ జోడీ వివాహం చేసుకుని 14 సంవత్సరాలు అయింది. కాలంతోపాటే బాండింగ్ అంతే బలపడింది. నమ్రత ఓ వైపు కుటుంబ బాధ్యతలతో పాటు.. మహేష్ కి అన్నీ తానే అయ్యి వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.మహేష్ ప్రతి వ్యాపకంలో నమ్రత భాగస్వామ్యం ఉంది. పిల్లలతో కలిసి కుటుంబ విహారయాత్రకు వెళుతున్నా లేదా సినిమా ప్రమోషన్ల సమయంలో మహేష్ వెన్నంటే నిలుస్తున్నారు నమ్రత. ఏఎంబీ సినిమాస్ వ్యాపార విస్తరణలో.. ఘట్టమనేని బ్యానర్ పురోభివృద్ధిలో ప్రతిదీ నమ్రత భాగస్వామ్యం ఉంది. ఈ జంట ఎప్పుడూ ఒకరికొకరు అండగా నిలుస్తారు. ఇటీవలి ఇంటర్వ్యూలో మహేష్ బాబు తన విజయవంతమైన కాపురంపైనా.. భార్య నమ్రత గురించి ఆసక్తికర సంగతుల్ని వెల్లడించారు.

ప్రఖ్యాత వోగ్ మ్యాగజైన్ తాజా ఇంటర్వ్యూలో మహేష్ మాట్లాడుతూ- ``నమ్రతను వివాహం చేసుకుని 14 సంవత్సరాలు అయ్యింది. మేం ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నాం. ఎవరికి వారు వ్యక్తిత్వాలకు విలువను ఇచ్చి నచ్చినట్టు జీవిస్తాం. అదే పెళ్లి పరమార్థం.. విజయ రహస్యం. విజయవంతమైన వివాహానికి ఇది చాలా ముఖ్యం. పిల్లలతో బాండింగ్ కూడా ఈ బంధం బలపడడానికి కారణం. ఇవన్నీ నాకు నేర్పించినందుకు నాన్నగారికే ఆ క్రెడిట్ ఇవ్వాలి. ఆయన షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వస్తే ఇక  స్టార్ కాదు. కేవలం నాన్న మాత్రమే`` అని తెలిపారు. మరిన్ని సంగతులు చెబుతూ.. నాన్నగారిలా క్రమశిక్షణ.. అంకితభావంతో ఉన్న మరో వ్యక్తిని చూడలేదు. నాన్న గారు వృత్తిని.. ఫ్యామిలీ లైఫ్ ని బాగా సమతుల్యం చేయగలిగారు`` అని మహేష్ వెల్లడించారు.

మహేష్ - నమ్రతా శిరోద్కర్ పరిచయం గమ్మత్తయినది. ఆ ఇద్దరూ `వంశీ` సినిమాలో కలిసి నటించారు. ఆ తర్వాత 10 ఫిబ్రవరి 2005 న పెళ్లి జరిగింది. 14 ఏళ్ల దాంపత్యంలో ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులు గా ఆనందకరమైన జీవితాన్ని లీడ్ చేస్తున్నారు. వారసులు గౌతమ్ -సితార ఇప్పటికే స్కూల్ వయసులో ఉన్నారు. గౌతమ్ 1నేనొక్కడినే చిత్రంలో బాల నటుడిగా నటించిన సంగతి తెలిసిందే. సితార డెబ్యూ కోసం అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు.