కశ్మీర్ ఆపరేషన్ ముగించి రాజధానికి!

Fri Jul 19 2019 18:57:18 GMT+0530 (IST)

కశ్మీర్ లో ఆపరేషన్ ముగిసింది. హైదరాబాద్ లో ఆర్మీ ఆపరేషన్ కి రెడీ అవుతోంది మహేష్ టీమ్. ఆ మేరకు దర్శకుడు అనీల్ రావిపూడి ట్విట్టర్ ద్వారా సమాచారం అందించారు. కశ్మీర్ లో `సరిలేరు నీకెవ్వరు` తొలి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయింది. రెండో షెడ్యూల్ ఈనెల 26 నుంచి హైదరాబాద్ లో ప్రారంభమవుతుందని అనీల్ రావిపూడి తాజా ట్వీట్ లో వెల్లడించారు. మహేష్ తో పని చేయడం మైండ్ బ్లోయింగ్ అంటూ ఆనందం వ్యక్తం చేశారు.`సరిలేరు నీకెవ్వరు` మహేష్ కెరీర్ 26వ సినిమా. తొలిసారి ఓ మిలటరీ అధికారిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణగా మహేష్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఎఫ్ 2 లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత అనీల్ రావిపూడి ఎంతో జోష్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఫన్ .. రొమాన్స్.. దేశభక్తి .. ఫ్యామిలీ ఎమోషన్స్ ఇన్ని అంశాల మేలు కలయికగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడట. పూర్తి కమర్షియల్ హంగులతో తీస్తున్నా.. అంతర్లీనంగా ఓ చక్కని సందేశం ఉంటుందని తెలుస్తోంది. 2020 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.

ఇక ఈ చిత్రం నుంచి జగపతిబాబు తప్పుకున్నారని ఆ స్థానంలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ని తీసుకునే ఆలోచనలో అనీల్ రావిపూడి- దిల్ రాజు బృందం ఉందని వార్తలొస్తున్నాయి. జగపతికి ఇతర సినిమాల షెడ్యూల్స్ తో క్లాష్ రావడమే ఈ ఛేంజెస్ కి కారణమన్న మాటా వినిపిస్తోంది. ఇక హైదరాబాద్ షెడ్యూల్ లో మహేష్ పై ట్రైన్ సెట్ లో కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారు. మరి ఈ షెడ్యూల్ లో ప్రకాష్ రాజ్ కలుస్తారా? అన్నది చూడాలి. కశ్మీర్ నుంచి హైదరాబాద్ ప్రయాణించే రైలులో సుధీర్ఘమైన ఎపిసోడ్స్ ని తెరకెక్కిస్తారని తెలుస్తోంది.