'వకీల్ సాబ్' రికార్డ్ ని బ్రేక్ చేసే దిశగా 'లవ్ స్టోరీ'..!

Fri Sep 24 2021 11:05:03 GMT+0530 (IST)

Love Story to break Vakeel Saab record

మోస్ట్ అవైటెడ్ మూవీ ''లవ్ స్టోరీ'' ఈరోజు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినీ అభిమానులతో పాటుగా చిత్ర పరిశ్రమ కూడా ఆసక్తిగా ఎదురు చేసిన ఈ సినిమా.. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లలో మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుంటోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ ఫీల్ గుడ్ ప్రేమకథా చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలోనే వసూళ్ళు రాబడుతోంది.కరోనా సెకండ్ వేవ్ పాండమిక్ తర్వాత అందరి దృష్టిని ఆకర్షించిన మొదటి సినిమా 'లవ్ స్టోరీ'. అందుకే చాలా రోజుల తర్వాత థియేటర్ల వద్ద జనాలు క్యూ కట్టడం కనిపిస్తోంది. ఈ సినిమాకి జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ - ఈరోజు థియేటర్ల వద్ద రెస్పాన్స్ చూస్తుంటే ప్రేక్షకులు మంచి కంటెంట్ ఉన్న సినిమాతో వస్తే కరోనా ని కేర్ చేయరని అర్థం అవుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో చాలా గ్యాప్ తర్వాత థియేటర్లు 'లవ్ స్టొరీ' మూలంగా మంచి కలెక్షన్లను చూస్తున్నాయి. అయితే ఆశ్చర్యకరంగా యూఎస్ఏ ప్రీమియర్స్ లో కూడా ఈ సినిమా సత్తా చాటుతోంది. అక్కడ కరోనా ప్రభావం వల్ల జనాలు సినిమాలు చూడటానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. పాండమిక్ తర్వాత యూఎస్ లో తెరుచుకున్న థియేటర్స్ కూడా పరిమిత సామర్థ్యాలతోనే నడుస్తున్నాయి.

కానీ 'లవ్ స్టోరీ' మూవీ యూఎస్ లో కూడా గట్టిగా ప్రభావం చూపుతోంది. ఇప్పటివరకు ప్రీమియర్ కలెక్షన్లు $246225 దాకా వచ్చాయని తెలుస్తోంది. ఇంకా 10 థియేటర్లకు సంబంధించిన నివేదికలు రావాల్సి ఉంది. ఇవి కూడా కలిపితే మొత్తం $280K డాలర్లు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన చూసుకుంటే 'లవ్ స్టోరీ' సినిమా ఈజీగా పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' సినిమా రికార్డ్ ని బ్రేక్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత విడుదలైన 'వకీల్ సాబ్' సినిమా ప్రీమియర్స్ ద్వారా $ 330000 రాబట్టింది. ఇప్పుడు 'లవ్ స్టోరీ' సినిమా ఆ ఫిగర్ క్రాస్ చేసే దిశగా దూసుకెళ్తోంది. యూఎస్ఏ ప్రీ సేల్స్ ఆల్రెడీ వకీల్ సాబ్ ను లవ్ స్టొరీ బీట్ చేసింది. ‘వకీల్ సాబ్’ కు ప్రీ సేల్స్ $120K ఉండగా.. లవ్ స్టోరీ $150K+ సాధించి దాన్ని బ్రేక్ చేసింది. ఈ సినిమా టికెట్ల హాట్ కేకుల్లా అమ్ముడవుతుండటం చూస్తుంటే.. రాబోయే రోజుల్లో మంచి వసూళ్ళు రాబట్టే అవకాశం ఉంది.

కాగా శేఖర్ కుమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య - సాయి పల్లవి జంటగా ''లవ్ స్టోరీ'' సినిమా తెరకెక్కింది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ - అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై నారాయణ దాస్ కె. నారంగ్ - పి. రామ్మోహన్ రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.