'లవ్ స్టోరీ' సెన్సార్ పూర్తి.. రన్ టైం ఎంతంటే..?

Tue Sep 14 2021 21:37:15 GMT+0530 (IST)

Love Story completed sensor

సినీ అభిమానులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోన్న సినిమాలలో ''లవ్ స్టోరీ'' సినిమా ఒకటి. యువ సామ్రాట్ నాగచైతన్య - సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా ప్రభావం వల్ల వాయిదా పడుతూ వచ్చింది.   ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి మెరుగ్గా ఉండటంతో ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురాడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 'లవ్ స్టోరీ' సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయినట్లు చిత్ర బృందం ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా తెలిపింది.యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన 'లవ్ స్టోరీ' చిత్రానికి 'U/A' (యూ/ఏ) సర్టిఫికేట్ జారీ చేసింది సెన్సార్ బోర్డ్. ఈ సినిమా నిడివి కూడా సుమారుగా 2గంటల 46నిమిషాలు (165.28 నిమిషాలు) వచ్చినట్లు తెలుస్తోంది. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ - అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. కె నారాయణదాస్ నారంగ్ - పి. రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరించారు. పవన్ సిహెచ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చగా.. విజయ్ సి కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. మార్తాండ్ కె. వెంకటేష్ ఈ చిత్రానికి ఎడిటింగ్ వర్క్ చేశారు.

ఇప్పటికే విడుదలైన 'లవ్ స్టోరీ' ప్రచార చిత్రాలు - టీజర్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. సాంగ్స్ అయితే యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ తో సెన్సేషనల్ క్రియట్ చేస్తున్నాయి. ఈ క్రమంలో రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. సిటీకి వచ్చి డ్యాన్స్ నేర్పిస్తూ జీవనం సాగించే మిడిల్ క్లాస్ అబ్బాయిగా నాగచైతన్య కనిపించనున్నారు. బీటెక్ పూర్తి చేసి సిటీలో ఉద్యోగ వేటలో ఉన్న అమ్మాయిగా సాయి పల్లవి సందడి చేయనుంది. డబ్బున్న ఫ్యామిలీకి చెందిన హీరోయిన్ కి.. మధ్యతరగతి కుటుంబానికి చెందిన హీరోకి మధ్య ఏర్పడిన సున్నితమైన ప్రేమకథ ను ఈ చిత్రంలో చూపించబోతున్నారు. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల - దేవయాని - ఈశ్వరీరావు - ఉత్తేజ్ ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటించారు. వరస విజయాలతో దూసుకుపోతున్న శేఖర్ కమ్ముల - చైతన్య - సాయి పల్లవి కలయికలో వస్తోన్న 'లవ్ స్టొరీ' ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.