`లవ్ స్టోరి` ట్రైలర్ ట్రీట్ ముహూర్తం ఫిక్స్

Sun Sep 12 2021 13:26:09 GMT+0530 (IST)

Love Story Trailer Release Date

నాగ చైతన్య- సాయి పల్లవి జంటగా  శేఖర్ కమ్ముల రూపొందించిన `లవ్ స్టోరి` సెప్టెంబర్ 24న థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రచారంలో వేగం పెంచింది. పాండమిక్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్ లలో విడుదలవుతున్న ప్రతిష్టాత్మక మూవీ లవ్ స్టోరి. ఇందులో చై-సాయిపల్లవి జంట రేవంత్- మౌనికగా నటించారు. ఈ జంట ప్రేమ కథను తెరపై చూసేందుకు ఆడియెన్స్ చాలా రోజులుగా వేచి చూస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 24న `లవ్ స్టోరి` థియేటర్ రిలీజ్ అటు ఎగ్జిబిషన్ సెక్టార్ లోనూ ఉత్సాహం నింపనుంది. తాజాగా సెప్టెంబర్ 13న 11.07 గంటలకు లవ్ స్టోరి ట్రైలర్ ని లాంచ్ చేస్తున్నామని చిత్రబృందం ప్రకటించింది.దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ... ``తప్పనిసరి పరిస్థితుల వల్ల ఇన్నాళ్లూ మా లవ్ స్టోరి చిత్రాన్ని వాయిదా వేస్తూ వచ్చాం. మా సినిమాను మీకు ఎప్పుడు చూపించాలి అనే ఆత్రుతగా సరైన సమయం కోసం వేచి చూశాం. ఆ గుడ్ టైమ్ రానే వచ్చింది. ఈ నెల 24న `లవ్ స్టోరి` చిత్రాన్ని థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాము. థియేటర్లలో కలుసుకుందాం. అంతకుముందే ట్రైలర్ వీక్షించండి`` అని అన్నారు.

`లవ్ స్టోరి` సినిమాలో పాటలు అనూహ్య ఆదరణ పొందాయి. యూట్యూబ్ వ్యూస్ లో `సారంగదరియా` ఆల్ టైమ్ రికార్డులు తిరగరాసింది. హే పిల్లా ..నీ చిత్రం చూసి.. పాటలు కూడా మ్యూజిక్ లవర్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. లక్షలాది వ్యూస్ సంపాదించాయి. లవ్ స్టోరి మ్యూజికల్ గా హిట్ అవడం సినిమా మీద మరిన్ని అంచనాలు పెంచాయి. దర్శకుడు శేఖర్ కమ్ముల చూపించబోయే ప్లెజంట్ ఎమోషనల్ ప్రేమ కథకు ఈ పాటలు అదనపు ఆకర్షణ కానున్నాయి. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ- అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. కె నారాయణదాస్ నారంగ్ పి. రామ్మోహన్ రావు నిర్మాతలు. లవ్ స్టోరి చిత్రంలో రాజీవ్ కనకాల- ఈశ్వరీ రావు- దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటించారు. విజయ్ సి.కుమార్  సినిమాటోగ్రఫీ.. మార్తాండ్ కె ఎడిటింగ్ నైపుణ్యం ప్రధాన అస్సెట్స్. పవన్ సి.హెచ్ మ్యూజిక్ కి అద్భుత స్పందన వచ్చింది. ట్రైలర్ పైనా భారీ అంచనాలున్నాయి. ఈ సోమవారం 11.07 గంటలకు విడుదలవుతున్న ట్రైలర్ దూసుకెళ్లడం ఖాయంగా కమ్ముల అభిమానులు అంచనా వేస్తున్నారు.