నవదీప్ 2.0 ని పరిచయం చేస్తున్న 'లవ్ మౌళి'..!

Wed Jan 26 2022 14:39:14 GMT+0530 (India Standard Time)

'Love Mouli' Introducing Navdeep 2.0 ..!

తెలుగు సినీ అభిమానులకు నవదీప్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. క్రియేటివ్ డైరెక్టర్ తేజ చేతుల మీదుగా 'జై' సినిమాతో హీరోగా లాంచ్ చేయబడిన నవదీప్.. 18 ఏళ్లుగా ఎన్నో చిత్రాల్లో విభిన్నమైన పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించారు.కెరీర్ ప్రారంభంలో హీరోగా సినిమాలు చేసిన నవదీప్.. ఆ తర్వాత విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హోస్ట్ గానూ గుర్తింపు తెచ్చుకున్నారు. 'గౌతమ్ SSC' 'చందమామ' 'ఆర్య 2' 'బాద్ షా' 'ధృవ' నేనే రాజు నేనే మంత్రి' 'అల వైకుంఠపురములో' 'మోసగాళ్లు' వంటి సినిమాలు నటుడికి మంచి పేరు తెచ్చిపెట్టాయి.

వెండితెరపైనే కాకుండా ఓటీటీలోనూ సత్తా చాటుతూ బిజీగా గడుపుతున్నారు. అయితే నవదీప్ చాలా గ్యాప్ తర్వాత హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ తాజాగా వచ్చింది. నేడు నవదీప్ పుట్టినరోజు సందర్భంగా సినిమాకు ''లవ్ మౌళి'' అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు ప్రకటించారు.

టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి ట్విట్టర్ వేదికగా ''లవ్ మౌళి'' టైటిల్ మోషన్ పోస్టర్ ఆవిష్కరించారు. "బాయ్స్ అండ్ గర్ల్స్.. బోల్డ్ డీప్ కలర్ ఫుల్ మౌలీని పరిచయం చేస్తున్నాము. పుట్టినరోజు శుభాకాంక్షలు డియర్ నవదీప్ 2.0. స్క్రీన్ మీద ఈ మాడ్ నెస్ ని అన్వేషించడానికి వేచి ఉండలేను" అని రానా పేర్కొన్నారు.

నవదీప్ 2.0 ని పరిచయం చేస్తున్న ''లవ్ మౌళి'' టైటిల్ మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. నవదీప్ ఇందులో సరికొత్త గెటప్ లో ఇంతకుముందు ఎన్నడూ కనిపించని అవతార్ లో ఉన్నాడు. దీనికి గోవింద్ వసంత అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. అవనీంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పంఖురి గిద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.

నైరా క్రియేషన్స్ బ్యానర్ పై ప్రశాంత్ రెడ్డి తాటికొండ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. మరి హీరోగా నవదీప్ కు ''లవ్ మౌళి'' సినిమా సరైన బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.