ధైర్యంగా కులం మీద ట్వీట్ చేసి..వెంటనే డిలీట్ చేసిన నటి

Tue Sep 10 2019 15:42:36 GMT+0530 (IST)

Lavanya Tripathi makes sensible caste tweet, deletes it

డిజిటల్ యుగంలోకి దూసుకెళుతున్నా.. నేటికి కులం.. మతం అంటూ అదేపనిగా కొట్టుకోవటం.. తిట్టుకోవటం తెలిసిందే. నాగరికత పెరుగుతున్న కొద్దీ.. కులమత గోడల్ని కూలగొట్టాల్సిన స్థానంలో కులాల వాట్సాప్ గ్రూపులు మొదలుకొని.. ఎవరికి వారు తమ కులాల్ని.. మతాల్ని మరింత ప్రేమించేసే దరిద్రపుగొట్ట పరిణామం అంతకంతకూ పెరగటం తెలిసిందే.ప్రజలకు తగ్గట్లే నేతల తీరు అలానే ఉందని చెప్పాలి. ప్రజల్ని చైతన్యపర్చాల్సిన నాయకులు అందుకు భిన్నంగా కులమతాల్ని ప్రోత్సహిస్తున్న వైనం అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకుంటే.. దానికి ఒక సినీ నటి స్పందించి పంచ్ ట్వీట్ చేయటం ఆసక్తికరంగా మారింది. అయితే.. తాను చేసిన ట్వీట్ కు లేనిపోని తిప్పలు ఎదురవుతాయన్న భయమో.. ఇంకేదైనా కారణమో కానీ ఆ వెంటనే డిలీట్ చేసిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇంతకీ ఏం జరిగిందంటే.. లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా.. కుల వ్యవస్థను ప్రోత్సహించేలా మాట్లాడటం షాకింగ్ గా మారింది. అత్యున్నత పదవిలో ఉన్న ఆయన.. ఇటీవల జరిగిన అఖిల బ్రాహ్మణ మహాసభకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్రాహ్మణ కులానికి అనుకూలంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

సమాజంలో బ్రాహ్మణులకు ఉన్నత స్థానం ఉందని.. అది పరుశురాముడి త్యాగం.. తపస్సు కారణంగా ప్రాప్తించిందన్నారు. ఈ కారణంతోనే బ్రాహ్మణులు సమాజంలో మార్గదర్శకత్వం వహించే కీలకభూమికను పోషిస్తున్నారంటూ ట్వీట్ చేశారు. ఇలాంటి హైప్రొఫైల్ వ్యక్తులు పెట్టే.. వ్యాఖ్యలకు స్పందించేందుకు ఏ మాత్రం ఇష్టపడని నటీమణులకు భిన్నంగా లావణ్య త్రిపాఠి రియాక్ట్ అయ్యారు.

స్పీకర్ ట్వీట్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలా వ్యాఖ్యలు చేయటం ఏమిటన్న నెటిజన్లకు తగ్గట్లే ఆమె రియాక్ట్ అయ్యారు. స్పీకర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. తానూ బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తినేనని.. అయితే.. కొందరు బ్రాహ్మణులకు మాత్రమే మేం గొప్ప అనే  భావన ఎందుకు ఉంటుందో తనకు అర్థం కావట్లేదన్నారు.

నువ్వు చేసే పనులతోనే నువ్వు గొప్పవాడివి అవుతావే కానీ.. నీ కులం వల్ల కాదంటూ లావణ్య ట్వీట్ చేశారు. స్పీకర్ వ్యాఖ్యలకు సరైన పంచ్ ఇచ్చినట్లుగా ఉన్న ఈ ట్వీట్ ను ఆమె కాసేపటికే డిలీట్ చేశారు. భయమా? మనకెందుకులే.. లేనిపోని వివాదమనా?  సెలబ్రిటీలు ధైర్యం చేసినప్పుడే కదా? సమాజంలో అంతో ఇంతో ఇలాంటి విషయాల గురించి మరింత ఎక్కువగా మాట్లాడేది. ఆ విషయాన్ని లావణ్య ఎలా మర్చిపోతారు?