Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : కృష్ణ వృంద విహారి

By:  Tupaki Desk   |   23 Sep 2022 12:31 PM GMT
మూవీ రివ్యూ : కృష్ణ వృంద విహారి
X
'కృష్ణ వృంద విహారి' మూవీ రివ్యూ
నటీనటులు: నాగశౌర్య-షిర్లీ సెటియా-రాధిక-వెన్నెల కిషోర్-రాహుల్ రామకృష్ణ-సత్య-బ్రహ్మాజీ-అన్నపూర్ణ-జయప్రకాష్ తదితరులు
సంగీతం: మహతి స్వర సాగర్
ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్
నిర్మాత: ఉష ముల్పూరి
రచన-దర్శకత్వం: అనీష్ కృష్ణ

'ఛలో' తర్వాత సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్నాడు యువ కథానాయకుడు నాగశౌర్య. గతంలో 'అలా ఎలా'తో మంచి హిట్ కొట్టి తర్వాత తడబడ్డ యువ దర్శకుడు అనీష్ కృష్ణతో నాగశౌర్య చేసిన కొత్త చిత్రం.. 'కృష్ణ వృంద విహారి'. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం నాగశౌర్యకు ఎలాంటి ఫలితాన్నిచ్చేలా ఉందో చూద్దాం పదండి.

కథ:

కృష్ణ (నాగశౌర్య) సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కుర్రాడు. చిన్నప్పట్నుంచి ఆచార వ్యవహారాల మధ్య చాలా పద్ధతిగా పెరిగిన అతను.. తనకు పూర్తి భిన్నమైన వాతావరణంలో పెరిగిన ఆధునిక అమ్మాయి అయిన వృంద (షెర్లీ సెటియా)ను ఇష్టపడతాడు. వృందకు కూడా కృష్ణ అంటే ఇష్టం ఉన్నప్పటికీ.. తనకు పిల్లలు పుట్టరనే కారణంతో అతణ్ని దూరం పెడుతుంది. ఐతే ఆ సమస్య గురించి తెలుసుకుని.. తనకు పిల్లలు అవసరం లేదని తనకు సర్దిచెప్పి.. తనకే ఏదో సమస్య తలెత్తినట్లుగా చెప్పి తన ఇంట్లో వాళ్లను ఒప్పించి వృందను పెళ్లి చేసుకుంటాడు కృష్ణ. కానీ కృష్ణ తల్లి సిటీలోని అతడి ఇంటికి రావడంతో కొత్త సమస్యలు తలెత్తుతాయి. అవేంటి.. వాటి వల్ల కృష్ణ-వృందల బంధంపై ఎలాంటి ప్రభావం పడింది అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

'అలా ఎలా' సినిమాతో సైలెంటుగా వచ్చి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన దర్శకుడు అనీష్ కృష్ణ. ఆ సినిమాలో సింపుల్ హ్యూమర్ తో అతను మెప్పించాడు. ఐతే ఆ తర్వాత అనీష్ నుంచి ఇలాంటి వినోదాత్మక చిత్రాలు ఆశిస్తే.. అందుకు భిన్నంగా లవర్, గాలి సంపత్ సినిమాలు తీసి నిరాశ పరిచాడు. ఐతే కృష్ణ వృంద విహారితో మళ్లీ అతను తన రూట్లోకి వచ్చాడు. కాకపోతే ఈసారి అతను అక్కడక్కడా కొన్ని నవ్వులైతే పంచాడు కానీ.. తొలి సినిమా స్థాయిలో ప్రేక్షకులకు గిలిగింతలు మాత్రం పెట్టలేకపోయాడు. కాన్ఫ్లిక్ట్ పాయింట్ వరకు బాగున్నప్పటికీ.. బలమైన కథ లేకపోవడం.. ఎక్కడా పెద్దగా మలుపులు లేకుండా.. ఆశ్చర్యానికి గురి చేయకుండా సాధారణంగా సాగిపోయే కథనం వల్ల సినిమా గ్రాఫ్ మీడియం మీటర్లో నడిచిపోయింది. ఎక్కడా హైస్ లేవు. అలా అని ఇది భరించలేని సినిమా కూడా కాదు. అలా అలా టైంపాస్ చేయడానికైతే ఓకే అనిపించే సినిమా ఇది.

చాలామంది రచయితలు.. దర్శకులు కథలో వచ్చే ట్విస్టు దగ్గర లేదంటే ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్ దగ్గర ఎగ్జైట్ అయిపోయి.. అదొక్కటే సినిమాను కాపాడేస్తుందని అనుకుంటారు. ఆ పాయింట్ కు అటు ఇటు ఫిల్లింగ్ లాగా సీన్లు పేర్చేసుకుని.. కామెడీ.. రొమాన్స్.. ఎమోషన్స్ అని మసాలాలు పులిమేసుకుని సినిమాను లాగించేస్తుంటారు. అనీష్ కృష్ణ కూడా దాదాపు చేసింది అదే. ఈ సినిమాలో కాన్ఫ్లిక్ట్ పాయింట్ బాగున్నప్పటికీ అది కొత్తది కూడా కాదు. హీరోయిన్ కు పిల్లలు పుట్టరని తెలిసి హీరో లోపం తనలో ఉందని చెప్పి పెళ్లికి ఒప్పించడం.. ఇరు కుటుంబాల్లో గందరగోళం నెలకొనడం గతంలో చాలా సినిమాల్లో చూశాం. ఎక్కడి వరకో ఎందుకు.. కొన్ని నెలల కిందటే వచ్చిన నాని సినిమా 'అంటే సుందరానికీ'లో కూడా సేమ్ కాన్సెప్ట్ చూశాం. పైగా అందులో ఆ పాయింట్ ను చాలా బలంగానే చెప్పే ప్రయత్నం జరిగినా.. మంచి హ్యూమర్ జోడించినా.. కూడా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఐతే యాదృచ్ఛికంగా జరిగిందో ఏమో తెలియదు కానీ.. అనీష్ కృష్ణ కూడా సేమ్ పాయింట్ తో కథను నడిపించాడు. సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెద్దవాళ్ల కట్టుబాట్లతో సతమతం అయ్యే హీరో పాత్రను చూడగానే.. 'అంటే సుందరానికీ'లోని సన్నివేశాలు కళ్ల ముందు కదలాడుతాయి. కాకపోతే అక్కడ హీరోను తండ్రి ఇబ్బంది పెడితే.. ఇక్కడ అమ్మ ఆ బాధ్యత తీసుకుంటుంది. అక్కడా ఇక్కడా బామ్మ క్యారెక్టర్ మాత్రం మామూలే.

ఇలా ఆరంభంలోనే మరో సినిమాకు అనుకరణలా కనిపించే 'కృష్ణ వృంద విహారి' ఆ తర్వాత కూడా ఏమాత్రం కొత్తదనం పంచదు. హీరోయిన్ని చూడగానే హీరో గుండెలో గంటలు మోగడం.. ఆమె వెంట పడడం.. ముందు అతణ్ని పట్టించుకోని హీరోయిన్ తర్వాత తన కోసం అతను పడే తపనకు.. తన కోసం చేసిన ఫైట్ కు ఫిదా అయిపోవడం.. ఇలా ఒక రొటీన్ టెంప్లేట్లో సాగిపోతుందీ సినిమా. కాకపోతే ఎంత రొటీన్ అనిపిస్తున్నప్పటికీ.. బోరింగ్ అనిపించకుండా సన్నివేశాలు చకచకా సాగిపోవడం ప్లస్. సత్య పాత్రతో చేయించిన కామెడీ బాగానే వర్కవుట్ అయింది. పాటలు కూడా ఆహ్లాదకరంగా సాగడం.. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలు పెద్దగా పండకపోయినా.. జంట చూడముచ్చటగా ఉండి.. వారి మధ్య రొమాన్స్ యూత్ ను ఆకట్టుకోవడంతో సినిమా చల్తా అనిపిస్తుంది. ఇక ఇంటర్వెల్ దగ్గర కథలో వచ్చే మలుపు.. వెన్నెల కిషోర్ చేసే హడావుడితో ప్రథమార్ధం ఓకే అనిపిస్తుంది.

కానీ ద్వితీయార్ధంలో వచ్చే ఫ్యామిలీ డ్రామాను తట్టుకోవడం మాత్రం కొంచెం కష్టమే. వందల సినిమాల్లో చూసిన అత్తా కోడళ్ల గొడవల తాలూకు సన్నివేశాలు 'కృష్ణ వృంద విహారి'ని సీరియల్ స్థాయికి తీసుకెళ్తాయి. ప్రతి ఇంట్లో జరిగే వ్యవహారం కాబట్టి రిలేటబుల్ అని ప్రేక్షకులు ఫీలవుతారనుకున్నారేమో కానీ.. ఈ సన్నివేశాలు పరమ రొటీన్ గా.. బోరింగ్ గా అనిపిస్తాయి. కథ పరంగానూ ద్వితీయార్ధంలో ఎగ్జైట్ చేసే అంశాలేమీ లేవు. అక్కడక్కడా కొంచెం కామెడీ మాత్రం వర్కవుట్ అయింది. పతాక సన్నివేశాలు పర్వాలేదనిపిస్తాయి. స్థూలంగా చెప్పాలంటే.. 'కృష్ణ వృంద విహారి' కొత్తగా అనిపించదు. ప్రేక్షకులను వినోదంలో ఏమీ ముంచెత్తేయదు. కాసేపలా కాలక్షేపం చేద్దామనుకుంటే మాత్రం ఓకే.

నటీనటులు:

నాగశౌర్య మరోసారి చక్కటి లుక్స్.. స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్నాడు. అతడి నటనకు కూడా వంకలు పెట్టడానికి లేదు. అన్ని సన్నివేశాల్లోనూ మంచి ఈజ్ తో నటించాడు. కథలో కీలకమైన ఎమోషనల్ సీన్లలోనూ మెప్పించాడు. సరైన కథలు పడితే అతను సినిమాను వేరే లెవెల్ కు తీసుకెళ్లగలడనిపిస్తుంది. కొత్త కథానాయిక షెర్లీ సెటియా ఆకట్టుకుంది. ఆమె రెగ్యులర్ హీరోయిన్లలా కాకుండా కొంచెం భిన్నంగా అనిపిస్తుంది. కొంచెం హైట్ తక్కువ కావడం మైనస్సే అయినా.. తన క్యూట్ లుక్స్ ఆకట్టుకుంటాయి. ఈ సినిమా వరకు ా తనకు సూటయ్యే పాత్ర దక్కింది. నటన ఓకే. కీలకమైన పాత్రలో రాధిక మెప్పించింది. చాదస్తపు పాత్ర కావడం వల్ల కొంచెం చికాకు పెట్టినా.. అలాంటి ఫీలింగ్ కలిగేలా నటించడంలోనే రాధిక తన ప్రత్యేకతను చాటుకుంది. వెన్నెల కిషోర్.. సత్య.. బ్రహ్మాజీ.. కనిపించినంత సేపూ బాగానే నవ్వించారు. రాహుల్ రామకృష్ణ పర్వాలేదు.

సాంకేతిక వర్గం:

నాగశౌర్యతో మహతి స్వర సాగర్ కాంబినేషన్ అనగానే ప్రతిసారీ ఛలో స్థాయిలో పాటలు ఊహించుకుంటాం. ఐతే ఆ తర్వాత అతను ఆ స్థాయిలో మ్యూజిక్ ఇవ్వట్లేదు. కృష్ణ వృంద విహారి పాటలు సూపర్ అనలేం. అలా అని తీసిపడేసేలా కూడా లేవు. వర్షంలో వెన్నెల్లా.. వినసొంపుగా అనిపిస్తుంది. దాని టేకింగ్ కూడా బాగుంది. మిగతా పాటలు పర్వాలేదు. మహతి నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. సాయిశ్రీరామ్ ఛాయాగ్రహణం బాగుంది. విజువల్స్ ఈ కథకు తగ్గట్లుగా కుదిరాయి. నిర్మాణ విలువల విషయంలో నాగశౌర్య ఫ్యామిలీ ఏమీ రాజీ పడలేదు. అలా ఎలా మూవీ తర్వాత నిరాశ పరుస్తూ వచ్చిన అనీష్ కృష్ణ.. గత సినిమాలతో పోలిస్తే మెరుగ్గా కనిపించాడు. కానీ తొలి సినిమా ప్రమాణాలను మాత్రం అందుకోలేకపోయాడు. కథలో కాన్ఫ్లిక్ట్ పాయింట్ బాగున్నా.. కథనం విషయంలో అతను రొటీన్ గానే ఆలోచించాడు. కామెడీ సీన్ల వరకు రైటింగ్.. ప్రెజెంటేషన్ బాగుంది. కామెడీ మీద అతడికున్న పట్టు అక్కడక్కడా తెలుస్తుంది. కానీ కథను ఇంకాస్త విస్తరించి.. ఆసక్తికర కథనాన్ని జోడించి ఉంటే.. ప్రేమకథను బాగా తీర్చిదిద్దుకునే ఉంటే బాగుండేది.

చివరగా: కృష్ణ వృంద విహారి.. సోసో సవారి

రేటింగ్-2.5/5