Begin typing your search above and press return to search.

క్షేమంగా ఉన్న కోటా.. ఆ వార్తలన్నీ అవాస్తవమే!

By:  Tupaki Desk   |   21 March 2023 10:36 AM
క్షేమంగా ఉన్న కోటా.. ఆ వార్తలన్నీ అవాస్తవమే!
X
కోట శ్రీనివాస రావు.. ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ప్రాణం ఖరీదు అనే సినిమా ద్వారా తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన ఈయన.. అతి తక్కువ కాలంలోనే మంచి స్థాయికి ఎదిగారు. అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా అహ నా పెళ్లంట సినిమాలో కథానాయిక తండ్రిగా చేసిన పిసినిగొట్టు పాత్ర కోటా శ్రీనివాసరావుకు చాలా మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇక అప్పటి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా పోయింది.

వరుస సినిమాల్లో ఛాన్సులు కొట్టేస్తూ.. వందలాది సినిమాల్లో నటించారు. కామెడీతో పాటు ప్రతినాయకుడు, హీరోలకు తండ్రిగా, బావగా, అన్నాగా, తాతగా.. ఇలా చాలా క్యారెక్టర్లలో కనిపించి మెప్పించారు.

ఈడెవడ్రా బాబూ, నాకేంటీ.. మరి నాకేంటి, మరదేనమ్మానా స్పెషల్, అయ్య నరకాసుర, అంటే నాన్నా అది.. అనే డైలాగ్స్ తో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఈయన నటనకు గాను 2015లో పద్మశ్రీ పురస్కారం కూడా దక్కింది. అయితే గత కొంత కాలంగా ఈయన ఆరోగ్యం బాగుండడం లేదు.

వయసు పెరుగుతున్నా కొద్దీ వచ్చే సమస్యలు వస్తుండడంతో తరచుగా ఈయనపై వార్తలు వస్తున్నాయి. అయితే ఈరోజు పొద్దుటి నుంచి ఆయన పరమపదించారు, చనిపోయారు, మృతి చెందారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ వార్తలన్నీ అవాస్తవమేనని.. ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కోటా శ్రీనివాసరావు ప్రస్తుతం ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నట్లు ఆయన కుటుంబ సభ్యులు కూడా వెల్లడించారు. తెలుగు వారి అభిమాన, అద్భుత ప్రతిభావంతమైన నటుడికి ఏమీ జరగలేదని.. తప్పుడు వార్తలు ప్రచురించొద్దని కోరారు.

ఒక్క దాంట్లో తప్పుడు వార్త వస్తే... దాన్ని చూసి చాలా మంది తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నారు. కానీ ఓ వార్త రాసేముందు అది నిజమో కాదో చూసుకుంటే బాగుంటుంది. లేదంటే బతికున్న వాళ్లను కూడా చంపేసి.. వారికి, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు మానసిక క్షోభను అందించినవారవుతారంటూ పలువురు సినీ పెద్దలు చెబుతున్నారు. ఇప్పటికైనా ఇలాంటి అసత్యపు వార్తలు ప్రచారం చేయొద్దని చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.