నువ్వు 'మహానటి' ఏంటని విమర్శించారు

Fri Mar 24 2023 12:05:25 GMT+0530 (India Standard Time)

Keerthy Suresh About Comments on Her Mahanati

దసరా సినిమాతో ఈనెల 30వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కీర్తి సురేష్ ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇటీవల ఒక మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ముఖ్యంగా మహానటి సినిమా చేస్తున్న సమయంలో కొందరు తీవ్రంగా విమర్శించారని కీర్తి సురేష్ గుర్తు చేసుకుంది.మహానటి సినిమా ను ఒప్పుకున్న సమయంలో నువ్వు ఆ పాత్రకి ఎలా సరిపోతావు అంటూ కామెంట్స్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మహానటి సావిత్రి పాత్రకు నన్ను సంప్రదించిన సమయంలో మొదట నో చెప్పాను.. కానీ దర్శకుడు నాగ్ అశ్విన్ పట్టుబట్టి నాపై నాకు నమ్మకాన్ని కలిగించి ఇది నువ్వు చేయగలవని ధైర్యాన్ని ఇచ్చి నాతో చేయించాడు.

ఆయన నన్ను అంతగా నమ్ముతున్నారు.. నేను ఎందుకు నాపై నమ్మకం ఉంచుకోకూడదని భావించాను. అందుకే మహానటి సినిమాను చేశాను. సినిమా ప్రమోషన్ సమయంలో నాపై వచ్చిన ట్రోల్స్ అన్నింటికీ చూసి షాక్ అయ్యాను. సినిమా విడుదల తర్వాత వాటన్నింటికీ సమాధానం లభించినట్లు అయింది.

సావిత్రమ్మకు ఉన్న ఆదరణ కారణంగా నేను ఆ పాత్రను చేస్తానంటూ ప్రకటన వచ్చిన వెంటనే తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఆ పాత్రను ఎవరు చేసినా కూడా ఖచ్చితంగా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సావిత్రమ్మ కూతురుతో మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. మహానటి సినిమాలో నటించే సమయంలో.. నటించిన తర్వాత ఎదురయ్యే సవాలను విమర్శలను ముందుగానే కొంతమేరకు ఊహించగలిగాను. అయినా కూడా దర్శకుడు.. ఇతర యూనిట్ సభ్యులు ఇచ్చిన ప్రోత్సాహంతో మహానటి సినిమా ను చేశానంటూ కీర్తి సురేష్ పేర్కొంది.

మహానటి సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా కీర్తి సురేష్ కి మంచి గుర్తింపు లభించింది. ప్రస్తుతం దసరా సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న కీర్తి సురేష్ తమిళంలో ఒక సినిమాను చేస్తోంది. హిందీ మరియు తెలుగు భాషల్లో కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.

మెగాస్టార్ చిరంజీవి కి చెల్లి పాత్రలో భోళా శంకర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. దసరా సినిమా తర్వాత కీర్తి సురేష్ స్థాయి మరింతగా పెరుగుతుందని చిత్ర యూనిట్ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు. కీర్తి సురేష్ కూడా దసరా సినిమాపై చాలా అంచనాలు పెట్టుకుని వెయిట్ చేస్తుంది.       


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.