ప్రైవేట్ ఫ్లైట్ లో సెలబ్రిటీలతో పెట్ డాగ్స్.. ఇదే ఇప్పుడు న్యూ ట్రెండ్..!

Tue Jun 28 2022 08:00:01 GMT+0530 (IST)

Keerthi Suresh On Instagram

ఇటీవల కాలంలో పెంపుడు జంతువులు అనేవి ప్రతి ఇంట్లో కామన్ గా ఉంటున్నాయి. తమ ఇష్టాఇష్టాలను బట్టి రకరకాల జంతుపులను పెంచుకుంటున్నారు. అయితే అన్నిటికంటే పెట్ డాగ్స్ మనుషులతో ప్రత్యేకమైన అనుబంధాన్ని కలిగి ఉంటున్నాయి.విశ్వాసానికి ప్రతిరూపంగా కుక్క ని భావిస్తుంటారు. కుక్క కి ఉన్న విశ్వాసం మనిషికి కూడా ఉండదంటారు పెద్దలు. మనిషికి డాగ్ కు మధ్య అనుబంధం నేపథ్యంలో ఇటీవల 'చార్లీ 777' అనే సినిమా విడుదలై మంచి సక్సెస్ సాధించింది.

దాదాపు అందరు సెలబ్రెటీలు కూడా తమ ఇళ్లలో కుక్కలను పెంచుకుంటూ వాటిపై ప్రేమను చూపిస్తుంటారు. పెట్ డాగ్స్ ని వారు ఎంత గారాబంగా చూసుకుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమ దైనందిన జీవితంలో ఎంత బిజీగా ఉన్నా.. వాటితో టైం స్పెండ్ చేస్తుంటారు.

వాటిని స్నేహితులుగా భావిస్తూ.. సరదాగా గడుపుతూ ఒత్తిడిని జయిస్తుంటారు. సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు తమ పెట్ డాగ్స్ తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. కొంతమంది సినీ తారలు తాము ఎక్కడికి వెళ్లినా తమతో పాటు పెంపుడు కుక్కను కూడా తీసుకెళ్లడం.. వాటికి ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటుంటారు.

టాలీవుడ్ లో ఈ మధ్య మన హీరోహీరోయిన్లు ఎక్కువగా పెట్ డాగ్స్ తో కనిపిస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా తమతో పాటుగా తీసుకెళ్తున్నారు. ప్రైవేట్ జెట్ లో వాటి కోసం స్పెషల్ గా టికెట్లు బుక్ చేసుకుని మరీ ట్రావెల్ చేస్తున్నారు.

RRR మూవీ ప్రమోషన్స్ సమయంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన పెంపుడు కుక్కను తనతో అన్ని నగరాలు తిప్పిన సంగతి తెలిసిందే. ఇటీవల యూత్ కింగ్ అఖిల్ అక్కినేని తన పెట్ డాగ్ తో కలిసి పోజ్ ఇచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

లేటెస్టుగా మహానటి కీర్తి సురేష్ తన డాగ్ తో కలిసి ఫ్లైట్ లో ట్రావెల్ చేసింది. ఇది తనతో కలిసి ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అని పేర్కొంటూ ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియో షేర్ చేసింది. ఇందులో కుక్క కోసం స్పెషల్ ఏర్పాట్లు చేసి ఉండటాన్ని గమనించవచ్చు. అన్నట్టు కీర్తి తన పెట్ కోసం ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్ కూడా ఓపెన్ చేసిందండోయ్.

పెంపుడు జంతువులు అంటే ఎక్కువ మక్కువ చూపించే రష్మిక మందన్నా ఇంటి నిండా కుక్కలు ఉంటాయి. షూటింగ్స్ కు ఇతర ప్రాంతాలకు వెళ్లేప్పుడు తన పెట్ కోసం స్పెషల్ ఫ్లైట్ టికెట్ బుక్ చేయమని ప్రొడ్యూసర్స్ ను డిమాండ్ చేస్తుందని ఇటీవల రూమర్స్ వచ్చాయి. అయితే స్టార్ హీరోయిన్ వాటిని ఖండించిన సంగతి తెలిసిందే.

ఏదేమైనా సెలబ్రిటీలు తమతో పాటుగా విమానాల్లో పెంపుడు కుక్కలను కూడా బయటకు తీసుకెళ్తూ.. సోషల్ మీడియాలో ప్రత్యేకంగా ఖాతాలను ఓపెన్ చేస్తూ వాటిని కూడా సెలబ్రిటీలుగా మారుస్తున్నారని చెప్పాలి.