Begin typing your search above and press return to search.

మహేష్ ఫ్యాన్స్ ని కలవరపెడుతున్న మహానటి..!

By:  Tupaki Desk   |   29 Jan 2022 3:30 AM GMT
మహేష్ ఫ్యాన్స్ ని కలవరపెడుతున్న మహానటి..!
X
దక్షిణాది అగ్ర కథానాయిక కీర్తి సురేష్ 'మహానటి' సినిమాతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుని దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. దీంతో కీర్తికి వరుసగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. అయితే దురదృష్టవశాత్తు ఆమె సెలెక్ట్ చేసుకున్న సినిమాలన్నీ నిరాశ పరచడమే కాదు.. బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాలుగా నిలిచాయి. ఇప్పుడు లేటెస్టుగా 'గుడ్ లక్ సఖి' మూవీ కూడా బ్యాక్ లక్ మిగిల్చిందని అంటున్నారు.

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన ఉమెన్ సెంట్రిక్ స్పోర్ట్స్ రోమ్-కామ్ 'గుడ్ లక్ సఖీ' ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తొలి ఆట నుంచే ఈ సినిమాకి ఆడియన్స్ మరియు క్రిటిక్స్ నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా ఆశించిన స్థాయిలో లేవని తెలుస్తోంది. దీంతో ఇది కూడా కీర్తి ప్లాప్ సినిమాల జాబితాలోకి చేరిపోయే అవకాశం ఉందని కామెంట్స్ వస్తున్నాయి.

కీర్తి సురేష్ 'మహానటి' తర్వాత 'స్వామి 2' 'పందెంకోడి 2' 'రంగ్ దే' 'అన్నాత్తే' 'మరక్కర్: అరేబియన్ సింహం' వంటి ప్లాప్స్ అందుకుంది. ఓటీటీలో వచ్చిన 'పెంగ్విన్' 'మిస్ ఇండియా' సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఇప్పుడు 'గుడ్ లక్ సఖి' మూవీ నిరాశ పరించపరిచిందని అంటున్నారు. దీనిని బట్టి కీర్తి స్క్రిప్ట్ ఎంపికలో ఏమాత్రం జాగ్రత్త తీసుకోలేదని అర్థం అవుతుంది. అయితే కీర్తి పరాజయాల పరంపర తదుపరి సినిమాలకు కొనసాగుతుందేమో అని ఫ్యాన్స్ కలవరపడుతున్నారు.

కీర్తి సురేశ్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో 'సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తోంది. పరశురామ్ పెట్లా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ - జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ - 14 రీల్స్ ప్లస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. మహానటి తొలిసారిగా మహేష్ పక్కన స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. మేకర్స్ సంశయించినా కళావతి పాత్రకు కీర్తి న్యాయం చేస్తుందని మహేష్ ఆమెపై విశ్వాసం ఉంచడంతో ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకున్నారని టాక్ ఉంది. కానీ ఇప్పుడు మహానటి ట్రాక్ రికార్డ్ చూస్తే ఆశాజనకంగా లేదు.

అందులోనూ అందంతో పాటు అభినయం కలబోసిన కీర్తి సురేష్.. ఇప్పటి వరకు పెద్ద హీరోలతో చేసిన సినిమాలన్నీ నిరాశ పరిచాయి. మధ్యలో విజయ్ తో చేసిన 'సర్కార్' మాత్రమే సక్సెస్ అయింది. పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి' - విజయ్ 'ఏజెంట్ భైరవ' - విక్రమ్ 'స్వామి 2' - సూర్య 'గ్యాంగ్' - ధనుష్ 'రైలు' - రజినీకాంత్ 'అన్నత్తే' - మోహన్‌ లాల్ 'మరక్కార్' సినిమాలను ఇందుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.

ఈ నేపథ్యంలో కీర్తి స్టార్ హీరోల సరసన నటించిన సినిమాలు ప్లాప్ అవుతాయనే బ్యాడ్ సెంటిమెంట్.. ఇప్పుడు మహేష్ బాబుతో 'సర్కారు వారి పాట' చిత్రంతో బ్రేక్ అవ్వాలని సూపర్ స్టార్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. SVP ప్రచార చిత్రాలు మరియు టీజర్ లో కీర్తి సురేష్ చాలా అందంగా కనిపించింది. మహేష్ బాబుకు మహానటి మంచి జోడీ అనిపించింది. ఇది ఖచ్చితంగా కీర్తి ఫేట్ మారుస్తుందనే భావన కలిగించింది. మహేష్ తన స్టార్ ఇమేజ్‌ తో కీర్తిని ప్లాప్స్ నుంచి బయటకు తీసుకురావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఇకపోతే కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగులో 'సర్కారు వారి పాట' తో పాటుగా 'భోళా శంకర్' చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సోదరిగా నటిస్తోంది. అలానే నాని సరస 'దసరా' సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. ఇదే క్రమంలో పలు తమిళ మలయాళ చిత్రాల్లో నటిస్తోంది.