Begin typing your search above and press return to search.

పేరులోనే తప్పించి సినిమాలో బూతు లేదట!

By:  Tupaki Desk   |   8 Dec 2019 7:00 AM GMT
పేరులోనే తప్పించి సినిమాలో బూతు లేదట!
X
భారీ బడ్జెట్ తో అదిరిపోయే కాంబినేషన్లో సినిమాలు తీయటం.. కిందామీదా పడి అంతా అయ్యాక.. ఫలితం ఏ మాత్రం తేడా కొట్టినా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ కావటం తెలిసిందే. ఇటీవల విడుదలైన కొన్ని క్రేజీ సినిమాలు ఎంతలా డిజాస్టర్ అయ్యాయో తెలిసిందే. దాని కంటే కాస్తంత బూతు కంటెంట్.. మరికాస్త చిలిపిదనంతో డార్క్ కామెడీతోనో.. మరో జోనర్ తో సినిమాలు తీయటానికి మించిన సేఫ్ మరొకటి లేదంటున్నారు.

కాకుంటే.. ఇలాంటి సినిమాలకు థియేటర్ల ప్రాబ్లం మామూలే. ముందు నుంచి ఉత్సుకత రేపేలా సినిమాను మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ ప్రొజెక్టు చేస్తే ఆ సమస్యా ఉండదు. అలాంటి కోవకు చెందిందే 90ఎం.ఎల్. డార్లింగ్ ఒళ్లో పడుకొని.. పాలసీసాలో లిక్కర్ ను పాలపీక ద్వారా చప్పరించే పోస్టర్లతో అందరి చూపు తన మీద పడేలా చేసుకున్న ఈ మూవీ ఇప్పటికే విడుదల కావటం తెలిసిందే.

ఈ మూవీ గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు చిత్ర హీరో కార్తికేయ. భిన్నమైన జోనర్స్ లో చేయటానికి తాను ఇష్టపడతానని.. సేఫ్ జానర్ అంటూ ఒకేలాంటి పాత్రలు చేయటానుకోవటం లేదని చెప్పారు. 90ఎం.ఎల్ మూవీ రివ్యూస్ పాజిటివ్ గా ఉన్నాయంటూ అయ్యగారు చెప్పిన మాటల్ని.. ఆయన కోణంలోనే అన్నది మర్చిపోకూడదు.

సోషల్ మీడియాలోనూ పాజిటివ్ కామెంట్స్ కనిపిస్తున్నాయని.. ఈ మాటలన్ని ఉత్తనే చెప్పట్లేదని.. తాను రెండు థియేటర్లకు వెళ్లి.. సినిమాకు ప్రేక్షకుల స్పందన చూశాకే చెప్పనన్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. సినిమా టైటిల్ అందరి కంట్లో పడేందుకన్న నిజాన్ని ఒప్పుకున్నాడు. సినిమా విడుదల ఒక రోజు ఆలస్యం కావటంపై వివరణ ఇస్తూ.. చిన్న సెన్సార్ సమస్యగా చెప్పాడు.

సినిమాలో అల్కాహాల్ బ్రాండ్ పేర్లు చెప్పాల్సిన సమయంలో బీప్ చేశామని.. ఎలాంటి బూతు డైలాగులు సినిమాలో లేవని చెప్పుకొచ్చారు. సినిమా చూస్తున్న ఆడియన్స్ లాజిక్ గురించి ఆలోచించకుండా నవ్వుకోవాలనే తామీ సినిమా తీసినట్లు చెబుతున్న కార్తికేయ.. ఇప్పుడున్న రోజుల్లో కూడా ఇలాంటి మాటల వర్క్ వుట్ అవుతాయా? అన్న సందేహం కలుగక మానదు. మొత్తమ్మీదా సినిమా టైటిల్ లోనే కానీ.. సినిమాలో ఎలాంటి బూతు లేదని భలేగా చెప్పుకున్నాడే. అలాంటప్పుడు టైటిల్ ను కూడా మార్చేస్తే బాగుండేది కదా?