ధనుష్ - రానా లతో కమ్ముల బిగ్ ప్లానింగ్?

Mon Nov 28 2022 12:34:02 GMT+0530 (India Standard Time)

Kammula's big planning with Dhanush and Rana?

ఫిదా- లవ్ స్టోరి లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించిన శేఖర్ కమ్ముల కొంత గ్యాప్ తీసుకుని మళ్లీ బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ధనుష్ తో ద్విభాషా చిత్రానికి కమ్ముల సన్నాహకాల్లో ఉన్నారు. ట్యాలెంటెడ్ ధనుష్ ఇప్పుడు తమిళ-తెలుగు ద్విభాషా  చిత్రం SIR (వాతీ) చేస్తున్నాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 2023లో గ్రాండ్ గా విడుదల కానుంది.  గత సంవత్సరం ధనుష్- శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో త్రిభాషా చిత్రాన్ని నిర్మాతలు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవల ప్రీప్రొడక్షన్ పనులు సహా కాస్టింగ్ ఎంపికల్లో కమ్ముల బిజీగా ఉన్నారు.ఎట్టకేలకు ఈ సినిమా 29 నవంబర్ ఉదయం అధికారికంగా లాంచ్ కానుందని సమాచారం. జాతీయ అవార్డు గ్రహీత ధనుష్ తో శేఖర్ కమ్ముల చేతులు కలుపడం భారీ అంచనాలను పెంచుతోంది. ఈ భారీ చిత్రాన్ని తెలుగు- తమిళం- హిందీ భాషల్లో తెరకెక్కించనున్నట్లు నిర్మాతలు తెలిపారు.

ఏషియన్ సినిమాస్ నారాయణ్ దాస్ నారంగ్ - పుస్కుర్ రామ్మోహన్ రావు సంయుక్తంగా SVCLLP బ్యానర్ పై ఈ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు. ప్రాజెక్ట్కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ధనుష్ సరసన కథానాయికగా నటించేది ఎవరు? అన్నది తెలియాల్సి ఉంది.

రాజకీయాల నేపథ్యంలో కాన్సెప్ట్?

టాలీవుడ్ లో వున్న మోస్ట్ టాలెంటెడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల. 'డాలర్ డ్రీమ్స్' నుంచి 'ఫిదా'-'లవ్ స్టోరి' వరకు ఆయన ఎంచుకున్న కథ కథలో తనదైన మార్కు సెన్సిబులిటీస్ ఎప్పుడూ మిస్ కాలేదు. అదే ఆయనకు ఓ ప్రత్యేక దర్శకుడిగా నిలబెట్టింది. 'ఫిదా' చిత్రంలో తెలంగాణ అమ్మాయి ప్రేమకథ.. పెళ్లి నేపథ్యంలో సినిమాని నడిపించి ఆకట్టుకున్న శేఖర్ కమ్ముల లవ్ స్టోరి కోసం కూడా తెలంగాణనే నేపథ్యంగా ఎంచుకున్నారు.

ఇప్పుడు ధనుష్ తో మూవీ లవ్ స్టోరి కాదని తెలుస్తోంది. థ్రిల్లర్ జోనర్ లో ఈ మూవీ వుండే అవకాశం వుందని తెలిసింది. ఇప్పటి వరకు సెన్సిబుల్ అంశాలని టచ్ చేస్తూ అందమైన ప్రేమకథల్ని తెరకెక్కిస్తూ సక్సెస్ లు చూస్తూ వస్తున్న శేఖర్ కమ్ముల తొలిసారి ధనుష్ తో థ్రిల్లర్ జోనర్ తో ప్రయోగానికి రెడీ అవుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. కమ్ముల నుంచి ఇప్పటి వరకు లవ్ స్టోరీలు.. ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ లే వచ్చాయి ఒక్క 'అనామిక' రీమేక్ తప్ప. దీంతో శేఖర్ థ్రిల్లర్ జోనర్ ని ఎంచు కోవడంపై చర్చ సాగుతోంది. ఇది రాజకీయాల నేపథ్యంలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతుందన్న ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే చిత్రకథాంశంపై కమ్ముల అధికారికంగా వెల్లడించాల్సి ఉంటుంది.

ఇక ధనుష్ తో మూవీ తరువాత రానాతో 'లీడర్'కు సీక్వెల్ ని చేయాలని కూడా ప్లాన్ చేసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. గతంలో ఈ సీక్వెల్  సూపర్ స్టార్ రజనీకాంత్ లేదా ఎవరైనా సీనియర్ హీరోతో  చేయబోతున్నారంటూ రకరకాల కథనాలు వినిపించాయి.  కానీ చివరికి 'లీడర్' సీక్వెల్ ని రానాతో చేయాలని భావిస్తున్నారని టాక్ వినిపించింది. సమకాలీన రాజకీయ అంశాలని మరింత లోతుగా చర్చిస్తూ ఈ  సీక్వెల్ని మరింత ప్రభావవంతంగా తీర్చి దిద్దాలని శేఖర్ భావిస్తున్నారట. 'లీడర్'కు ప్రశంసలు దక్కినా తాను అనుకున్న స్థాయికి ఆ సినిమా వెళ్లలేదన్నది దర్శకుడు శేఖర్ కమ్ములకు చిన్న వెలితి వుంది. దాన్ని అధిగమించి తొలి భాగానికి మించి సీక్వెల్ తెరకెక్కించాలనేది ప్లాన్. దీనికి సంబంధించిన అప్ డేట్ ని కూడా త్వరలోనే శేఖర్ కమ్ముల ప్రకటించే అవకాశం వుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.