చిరు అల్లుడికి పాజిటివ్.. ఎవరినీ వదలని కోవిడ్!

Thu Apr 22 2021 15:18:13 GMT+0530 (IST)

Kalyan Dev tested Positive For The Virus

దేశవ్యాప్తంగా కోవిడ్ సెకండ్ వేవ్ అట్టుడికిస్తోంది. మహమ్మారీ తగ్గుముఖం పట్టాక స్వేచ్ఛగా షూటింగులు చేసుకోవచ్చని అనుకున్నారు. ప్రభుత్వ జీవో ప్రోటోకాల్ ప్రకారం నియమాల్ని అనుసరిస్తూనే షూటింగులు చేస్తున్నారు. కానీ కోవిడ్ మహమ్మారీకి అవేమీ పట్టడం లేదు. అది అందరినీ వెంటాడుతోంది. టాలీవుడ్ ఇందుకు మినహాయింపేమీ కాదు.సెకండ్ వేవ్ మరింత వేగంగా చుట్టేస్తోంది. దీంతో ఒక్కొక్కరుగా కోవిడ్ భారిన పడుతున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్- రచయిత విజయేంద్ర ప్రసాద్- దర్శకులు వి.ఎన్.ఆదిత్య- రవివర్మ.. అగ్రనిర్మాతలు అల్లు అరవింద్ - దిల్ రాజు తదితరులకు కోవిడ్ సోకింది. వీరంతా ఐసోలేషన్ లోకి వెళ్లి చికిత్స తీసుకుంటున్నారు. ఇంకా ఇండస్ట్రీ ప్రముఖులు చికిత్స పొందుతున్న వారి సంఖ్య పెద్దగానే ఉంది. ఇటీవలే చిరు -రామ్ చరణ్ కూడా చికిత్స పొంది కోలుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే చరణ్ కారవాన్ డ్రైవర్ కి కోవిడ్ సోకిన అనంతరం దుర్వార్త అందింది. దీంతో చరణ్ ముందు జాగ్రత్త చర్యగా స్వీయ ఐసోలేషన్ లోకి వెళుతున్నారని తెలిసింది.

తాజా సమాచారం మేరకు.. మెగాస్టార్ చిరంజీవి అల్లుడు .. హీరో కళ్యాణ్ దేవ్ కి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియాల్లో వెల్లడించారు. స్వల్ప లక్షణాలున్నాయని ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నానని తెలిపారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారంతా త్వరగా కోలుకుని యథాస్థితికి రావాలని ఆకాంక్షిద్దాం. ఇక ఆన్ లొకేషన్ ఉన్నవారంతా తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ముప్పు తప్పదు.