Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : కబ్జ

By:  Tupaki Desk   |   17 March 2023 8:15 PM GMT
మూవీ రివ్యూ : కబ్జ
X
'కబ్జ' మూవీ రివ్యూ
నటీనటులు: ఉపేంద్ర-శ్రియ సరన్-కిచ్చా సుదీప్-శివరాజ్ కుమార్-మురళీ శర్మ-దేవ్ గిల్-జాన్ కొక్కెన్-సుధ తదితరులు
సంగీతం: రవి బస్రూర్
ఛాయాగ్రహణం: ఎ.జె.శెట్టి
నిర్మాతలు: ఆర్.చంద్రు-ఆనంద్ పండిట్-అలంకార్ పాండ్యన్
రచన-దర్శకత్వం: ఆర్.చంద్రు

కేజీఎఫ్.. కాంతార.. లాంటి చిత్రాలతో గత కొన్నేళ్ల నుంచి జాతీయ స్థాయిలో కన్నడ సినిమా పేరు మార్మోగుతోంది. ఇప్పుడు ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మరో భారీ చిత్రం 'కబ్జ'. కన్నడ టాప్ స్టార్లలో ఒకడైన ఉపేంద్ర ప్రధాన పాత్రలో ఆర్.చంద్రు రూపొందించిన ఈ చిత్రం ఈ రోజే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆ అంచనాలను సినిమా ఏ మేర అందుకుందో చూద్దాం పదండి.


కథ:

అర్కేశ్వర్ (ఉపేంద్ర) ఒక స్వాతంత్ర్య సమర యోధుడి కొడుకు. బ్రిటిష్ వాళ్లు పన్నిన కుట్రలో అతడి తండ్రి చనిపోగా.. ఉత్తరాదిన తాము పుట్టిన ఊరును విడిచిపెట్టి దక్షిణాదికి వచ్చేస్తుంది ఆర్కేశ్వర్ కుటుంబం. 1970 ప్రాంతంలో అర్కేశ్వర్ ఇండియన్ ఎయిర్ ఫోర్సులో పైలట్ శిక్షణ పొంది.. తన తల్లి.. అన్నయ్యను చూసేందుకు సెలవు మీద తన ఊరికి వస్తాడు. ఐతే ఆ ప్రాంతాన్ని గుప్పెట్లో పెట్టుకున్న ఖాలెద్ కు కొడుకైన సర్దార్ చేసిన ఒక దారుణాన్ని చూసి తట్టుకోలేక అర్కేశ్వర్ అన్నయ్య అతణ్ని చంపేస్తాడు. ప్రతిగా ఖాలెద్.. అర్కేశ్వర్ అన్నను చంపుతాడు. దీంతో అప్పటిదాకా సాధు జీవిలా ఉన్న అర్కేశ్వర్లో ఆగ్రహం కట్టలు తెంచుకుని ప్రతీకారానికి సిద్ధపడతాడు. ఈ క్రమంలో అతనేం చేశాడు.. ఖాలెద్ తో అతడి పోరాటం ఎక్కడిదాకా వెళ్లింది అన్నది మిగతా కథ.


కథనం-విశ్లేషణ:

ఈ మధ్యే 'ఫర్జీ' అనే వెబ్ సిరీస్ ఒకటి వచ్చింది. అందులో కరెన్సీ నోట్లతో పాటు ప్రతి వస్తువుకూ నకిలీలు తయారు చేసే ఒక బ్యాచ్ ని చూపిస్తారు. మార్కెట్లోకి ఏ బ్రాండెడ్ వస్తువు వచ్చినా సరే.. వెంటనే కాపీ కొట్టి నకిలీ వస్తువును తయారు చేస్తారు. ఐతే ఇలాంటి నకిలీ వస్తువులు పైకి చూడ్డానికి ఒరిజినల్ లాగే అనిపిస్తాయి. కానీ వాటిని వాడటం మొదలుపెట్టాక కానీ అది పక్కా డూప్లికేట్ అని అర్థం కాదు. సినిమాల్లో కూడా ఇలాంటి నకిలీలకు లోటు ఉండదు. ఒక ట్రెండ్ సెట్టింగ్ సినిమా వచ్చాక.. దాన్ని అనుసరించే సినిమాలకు తోడు.. 'అనుకరించే' చిత్రాలు కూడా కొన్ని ఉంటాయి. వాటి ప్రోమోలు చూస్తే అంతకుముందు చూసిన 'ఒరిజినల్'ను తలపిస్తాయి. ఐతే సినిమా చూశాక కానీ వాటిలో డొల్లతనం అర్థం కాదు. 'కబ్జ' సినిమా ఈ కోవకే చెందుతుంది. ఇక్కడ 'కేజీఎఫ్' అనేది ఒరిజినల్ అయితే.. దాన్ని కాపీ కొట్టబోయి బోల్తా కొట్టిన డమ్మీ సినిమా 'కబ్జ'.

'కబ్జ' టీజర్.. ట్రైలర్ చూసినపుడే.. అందులోని ప్రతి ఫ్రేమ్ 'కేజీఎఫ్'ను గుర్తుకు తెచ్చాయి. ఐతే ఒక ట్రెండ్ సెట్టింగ్ బ్లాక్ బస్టర్ మూవీని చూసి వేరే చిత్రాలు స్ఫూర్తి పొందడం కొత్తేమీ కాదు. దాన్ని తప్పుబట్టలేం కూడా. ఇలా హిట్టయిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. కానీ 'కబ్జ' అలా స్ఫూర్తి పొంది తీసిన సినిమాలా కాకుండా.. 'కేజీఎఫ్'ను అడుగడుగునా కాపీ కొడుతూ తీసిన చీప్ ప్రాడక్ట్ లాగా కనిపిస్తుంది. ఓవైపు 'కేజీఎఫ్' సినిమాను ప్లే చేసి చూస్తూ ఈ స్క్రిప్టు రాశారేమో.. అలాగే షూట్ చేస్తున్నపుడు.. ఎడిటింగ్ టైంలో.. మిగతా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తున్నపుడు కూడా ఆ సినిమాను అలాగే ప్లే చేస్తూ యాజిటీజ్ ఇలాగే తీయాలి అని ఫిక్స్ అయి ఈ సినిమా చేశారేమో అనిపిస్తుంది. ఐతే కాపీ కొడితే కొట్టారు.. కొంచెమైనా లాజిక్ ఉండేలా చూసుకున్నారా.. క్యారెక్టర్లను సరిగా తీర్చిదిద్దుకున్నారా.. కథలో ఎమోషన్ గురించి ఆలోచించారా అంటే అదేమీ లేదు. విషయం లేకుండా.. కేవలం ఎలివేషన్ల మీద ఆధారపడి సినిమా మొత్తం వాటితోనే నింపేశారు.

'కేజీఎఫ్'లో మాదిరి ఇక్కడ హీరో పాత్రకు ఒక గ్రాఫ్ ఉండదు. ముందు ఆ పాత్రను ప్రేక్షకులకు కనెక్ట్ చేసే ప్రయత్నమే జరగలేదు. సినిమా మొత్తంలో హీరో ఫైట్లు మాత్రమే చేస్తుంటాడు. స్వయంగా గొప్ప దర్శకుడు కూడా అయిన ఉపేంద్ర.. అసలు ఏం చూసి ఈ పాత్రను.. సినిమాను ఒప్పుకున్నాడన్నది అర్థం కాని విషయం. సినిమా అంతటా ఒకటే గోల... ముందు ఒక పాత్ర గురించి విపరీతమైన బిల్డప్ ఇస్తారు.. వాడు మహా క్రూరుడు.. దుర్మార్గుడు అంటారు. తెర మీద పాత్రలన్నీ ఆ పేరు విని నిర్ఘాంతపోతుంటాయి. తీరా ఆ పాత్రకు అంత బిల్డప్ తర్వాత రంగప్రవేశం చేసి హీరో చేతిలో చావు దెబ్బలు తింటుంది. నిమిషాల్లో ఆ పాత్ర ముగిసిపోతుంది. ఇలా కనీసం అరడజను పాత్రలైనా ఉంటాయి. వాటి చుట్టూ అల్లిన యాక్షన్ ఘట్టాల్లో బ్యాగ్రౌండ్ స్కోర్ కు చెవులు చిల్లులు పడతాయి. ఎడిటింగ్ జర్కులకు కళ్లు బైర్లు కమ్ముతాయి.

హీరో ఒక మామూలు వ్యక్తిగా అడుగు పెట్టి.. అనుకోకుండా ఒక గొడవలో తలదూర్చి డాన్ అయిపోవడం.. తర్వాత పెద్ద పెద్ద తలకాయల్ని కొట్టి 'కింగ్'గా అవతరించడం.. దశాబ్దాల నుంచి చూస్తున్న రొటీన్ కథనే ఇందులోనూ చూస్తాం. కథన పరంగా కనీస ఆసక్తి రేకెత్తించే సీన్ ఒక్కటీ లేదు. స్వాతంత్ర్య పోరాటం.. సంస్థానాలు.. రాజ కుటుంబీకులు.. ఈ నేపథ్యంలో అల్లిన కథ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. బ్యాగ్రౌండ్లో కథను నరేట్ చేసే వాయిస్ దగ్గర్నుంచి ప్రతిదీ 'కేజీఎఫ్'ను అనుకరిస్తూ సాగి... సినిమాలో 'ఒరిజినల్' ఫీలింగ్ కలిగించే ఒక్క అంశమూ లేకపోయింది. 'కేజీఎఫ్' విపరీతంగా నచ్చిన జనాలు.. కావాలంటే మళ్లీ ఆ సినిమా చూసుకుంటారు కానీ.. మళ్లీ అలాంటి అచ్చుగుద్ది దింపేస్తే ఎలా ఎగబడి చూసేస్తారన్న మినిమం లాజిక్ మేకర్స్ కు తట్టకపోవడం.. పైగా ట్రైలర్లో 'Next big thing in Indian cinema' అని వాళ్లకు వాళ్లే ఒక ట్యాగ్ వేసుకోవడం విడ్డూరం. 'కబ్జ'ను రెండున్నర గంటలు భరించడమే చాలా కష్టం అంటే.. ఈ కథను మధ్యలో ఆపేసి రెండో పార్ట్ చూసుకోండని హెచ్చరిక జారీ చేయడం పెద్ద షాక్.



నటీనటులు:

ఉపేంద్ర ఏం చూసి ఈ పాత్ర.. సినిమా ఒప్పుకున్నాడన్నది బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్థం కాదు. అసలు ఇందులో హీరో పాత్రకు అతను సూట్ కాలేదు. ఇదేమంత విషయం ఉన్న పాత్ర కాకపోయినా.. చిన్న వయసులో ఉన్న నటుడెవరైనా అయితే బాగుండేదనిపిస్తుంది. వయసు ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్న ఉపేంద్ర.. హర్కేశ్వర్ పాత్రకు న్యాయం చేయలేకపోయాడు. తన స్థాయికి ఈ పాత్ర ఏమాత్రం సూట్ కానిది. చాలా చోట్ల ఉపేంద్ర ఉత్సవ విగ్రహంలా కనిపించాడు. శ్రియ కూడా కథానాయిక పాత్రలో చాలా 'ఓల్డ్' ఫీల్డ్ కలిగిస్తుంది. యువరాణి పాత్రకు పూర్తిగా మిస్ మ్యాచ్ అనిపిస్తుంది. కిచ్చా సుదీప్ కనిపించింది కాసేపే కాబట్టి తన ఇంపాక్ట్ ఏమీ లేదు. శివరాజ్ కుమార్ చివర్లో ఒక్క నిమిషం కనిపించాడు. రెండో భాగంలో వీళ్లిద్దరి పాత్రలు కీలకంగా ఉండొచ్చేమో. ఫస్ట్ పార్ట్ లో మాత్రం నటీనటుల పెర్ఫామెన్సుల గురించి చెప్పడానికి ఏమీ లేకపోయింది.



సాంకేతిక వర్గం:

'కేజీఎఫ్'ను కాపీ కొడుతూ తీసిన సినిమా కాబట్టి.. దాని మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ నే దీనికీ తీసుకున్నారు. అతను తనకు అలవాటైన రీతిలో బ్యాగ్రౌండ్ స్కోర్ మోత మోగించేశాడు. కానీ సన్నివేశాల్లో విషయం లేకుండా బ్యాగ్రౌండ్లో ఎంత వాయిస్తే ఏం లాభం? రవి ప్రభావం పెద్దగా కనిపించదు. పాటలు అంతంతమాత్రమే. ఎ.జె.శెట్టి విజువల్స్.. కలర్ థీమ్స్ అన్నీ కూడా 'కేజీఎఫ్'ను తలపించేలాగే ఉన్నాయి. ఎడిటింగ్ ప్యాటర్న్ కూడా యాజిటీజ్ అలాగే ఫాలో అయిపోయారు కాబట్టి వీటి గురించి ఏం మాట్లాడగలం? తెలుగు డబ్బింగ్ విలువలు కూడా పేలవంగా ఉండటం ఈ సినిమాకు మన ప్రేక్షకులు మరింతగా డిస్కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. పోసాని కృష్ణమురళి.. మురళీ శర్మ లాంటి నటులకు ఏమాత్రం సూట్ కాని వాయిస్ లతో డబ్బింగ్ చెప్పించడం ఆశ్చర్యం కలిగించే విషక్ష్ం. దర్శకుడు ఆర్.చంద్రుకు కన్నడలో మంచి పేరే ఉంది. తెలుగులో కూడా రీమేక్ అయిన 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' లాంటి సెన్సిబుల్ సినిమాలు తీశాడతను. అలాంటి దర్శకుడు తనే నిర్మాత అవతారం కూడా ఎత్తి.. ఇంతింతమంది స్టార్లను పెట్టుకుని.. ఇన్నిన్ని కోట్లు పోసి 'కేజీఎఫ్' డూప్లికేట్ తీయడానికి ఇంత ప్రయాస ఎందుకు పడ్డాడన్నది అర్థం కాని విషయం. ప్రతి విషయంలోనూ అనుకరణ తప్పితే.. అతను ప్రత్యేకంగా ఏం చేసినట్లు కనిపించదు.

చివరగా: కబ్జ.. కేజీఎఫ్ డూప్లికేట్

రేటింగ్-1.5/5