వారితో సుశాంత్ కు ప్రాణహాని... ఫిబ్రవరి 25నే పోలీస్ కంప్లయింట్!

Mon Aug 03 2020 21:30:45 GMT+0530 (IST)

Sushant suicide case ... Sensational allegations against Bandra police

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. బాలీవుడ్ లో నెపోటిజం వల్లే సుశాంత్ సూసైడ్ చేసుకున్నాడని ఓ వైపు వాదనలు వినిపిస్తుంటే. సుశాంత్ ది హత్య అని....మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సుశాంత్ కేసుకు సంబంధించి రోజుకో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. సుశాంత్ కేసు దర్యాప్తులో ఎన్నో అనుమానాలున్నాయని పలు మీడియా సంస్థలు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సుశాంత్ కేసులో ముంబై పోలీసుల తీరు సరిగా లేదంటూ పలువురు ఆరోపిస్తున్నారు. సుశాంత్ కేసు విచారణకు వచ్చిన బీహార్ పోలీసులను అడ్డుకొనేందుకు ముంబై పోలీసులు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ముంబై పోలీసులపై సుశాంత్ తండ్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 25నే సుశాంత్ ప్రమాదంలో ఉన్నాడని తాను బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని సుశాంత్ తండ్రి విడుదల చేసిన సెల్ఫీ వీడియో తాజాగా కలకలం రేపుతోంది.సుశాంత్ జూన్ 14న చనిపోయాడని కానీ ఫిబ్రవరి 25న తాను సుశాంత్ కు కొందరు వ్యక్తుల వల్ల ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశానని వెల్లడించారు. తనకు అనుమానం ఉన్న వ్యక్తుల పేర్లు కూడా తాను పోలీసులకు వెల్లడించానని వారిపై చర్యలు తీసుకోవాలని బాంద్రా పోలీసులను కోరానని సెల్ఫీ వీడియోలో చెప్పారు. సుశాంత్ తమకు దూరమై 40 రోజులవుతున్నా ఈ కేసు విషయంలో పురోగతి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తాను సుశాంత్ అనుమానాస్పద మృతిపై పాట్నా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. సుశాంత్ అకౌంట్ నుంచి తన ప్రియురాలు రియా చక్రవర్తి రూ.15 కోట్లు అజ్ఞాత ఖాతాకు మళ్లించిందని పాట్నా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సుశాంత్ తండ్రి పేర్కొన్నారు. ఆ డబ్బులు ఎవరికి పంపిందో విచారణ జరపాలని కోరారు. సుశాంత్ మృతికి దారితీసిన పరిస్థితులు అందులో రియా పాత్రపై విచారణ చేయాలని సుశాంత్ తండ్రి గతంలోనే కోరారు.