ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఖుషీ చేసే అప్డేట్ రాబోతోందా..?

Mon Jan 17 2022 18:02:21 GMT+0530 (India Standard Time)

Jr NTR finally hits the top gear with NTR30

ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువ కాలం బిగ్ స్క్రీన్ మీద కనిపించని స్టార్ హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముందు వరుసలో ఉంటారు. చివరగా 2018 లో 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రంలో కనిపించిన తారక్.. అప్పటి నుంచి 'ఆర్.ఆర్.ఆర్' చిత్రానికే అంకితమయ్యారు. ఎట్టకేలకు సంక్రాంతి కానుకగా విడుదల అవుతుందనుకున్న ఈ సినిమా మళ్ళీ వాయిదా పడింది. దీంతో ఎన్టీఆర్ ను వెండితెర మీద చూడటానికి అభిమానులు ఇంకొన్ని నెలలు వేచి చూడాల్సి వస్తోంది. వీలైనంత త్వరగా తదుపరి ప్రాజెక్ట్ సెట్స్ మీదకు తీసుకెళ్తారని అనుకుంటుండగా.. అది కూడా లేట్ అవుతూనే ఉంది.ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ మీద ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిన వెంటనే.. అగ్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ఈ మూవీ గతేడాది సెట్స్ పైకి వెళ్లాల్సి ఉండగా ఆచార్యతో కొరటాల శివ.. ఆర్ఆర్ఆర్ తో తారక్ బిజీగా ఉండటంతో ఆలస్యమైంది. అయితే ఫ్యాన్స్ ని ఖుషీ చేసే ఓ న్యూస్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే #NTR30 సినిమా ఫార్మల్ లాంచ్ కు సంబంధించిన అప్డేట్ రాబోతోందట.

కొరటాల శివ సినిమా షూటింగ్ 2022 ఫిబ్రవరిలో ప్రారంభిస్తామని ఎన్టీఆర్ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన సంగతి తెలిసిందే. కాకపోతే ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. కాగా 'జనతా గ్యారేజ్' వంటి సూపర్ హిట్ తర్వాత తారక్ - కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందనున్న రెండో సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.

#NTR30 పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రివేంజ్ డ్రామాగా తెరకెక్కనుంది. అంతేకాదు ఇది కొరటాల శివ శైలి సందేశాత్మక కమర్షియల్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఇందులో స్టూడెంట్ యూనియన్ లీడర్ గా ఎన్టీఆర్ కనిపించబోతున్నారని టాక్. పాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్న ఈ చిత్రం కోసం వివిధ భాషల ప్రముఖ నటీనటులను ఎంపిక చేస్తున్నారని సమాచారం.

ఎన్టీఆర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ని ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు రెండు రోజుకు క్రితం సోషల్ మీడియా అలియా భట్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేయబడింది. ఇకపోతే తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ - ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఈ ప్రాజెక్ట్ లో భాగం కానున్నారని సమాచారం. నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు.